
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో సూపర్ బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ తనకెంతో ఇష్టమైన టెస్టు ఫార్మాట్‌లో మూడేండ్ల గ్యాప్ తర్వాత సెంచరీ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన విరాట్.. చాన్నాళ్ల పాటు జట్టు కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నానన్న విషయం తన మెదడును తొలిచివేసేదని చెప్పాడు. ప్రతి ఒక్కరూ సెంచరీ ఎప్పుడు? అని అడగడంతో ఇబ్బంది పడ్డానని వెల్లడించాడు. ‘మూడంకెల స్కోరు చేయకపోతే ఒక బ్యాటర్‌కు నిరాశ ఉండటం సహజమే. నా వరకు నేను 40–45 రన్స్‌తో సంతృప్తి చెందే వ్యక్తిని కాదు. జట్టు కోసం పెర్ఫామ్ చేయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తా. 40 రన్స్ వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. నేను 150 రన్స్ చేయగలనని నాకు తెలుసు. కానీ, కొన్నాళ్లుగా జట్టు కోసం పెద్ద స్కోర్లు ఎందుకు చేయలేకపోతున్నాను? అనే ప్రశ్న నా మనసును తొలిచి వేసింది. ఎందుకంటే ఇదివరకు జట్టుకు నా అవసరం ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో నేను సత్తా చాటాను.
కానీ, కొన్నాళ్లుగా అలాంటి ఇన్నింగ్స్‌లు రాకపోవడం నన్ను బాధ పెట్టింది. ఇంకోవైపు మ్యాచ్ కోసం హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చింది మొదలు.. లిఫ్ట్‌లో, గేటు బయట, చివరకు బస్ డ్రైవర్ ‘మాకు సెంచరీ కావాలి’ అనడం ఇబ్బందిగా అనిపించింది’ అని విరాట్ చెప్పుకొచ్చాడు. తాను కూడా విరాట్ నుంచి సెంచరీ చూడాలని కోరుకున్నట్టు ద్రవిడ్ చెప్పాడు. ఇక, పర్సనల్ రికార్డులు, మైలురాళ్ల గురించి తాను ఆలోచించనని కోహ్లీ స్పష్టం చేశాడు. జట్టు కోసం ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలన్న తన లక్ష్యంలో భాగంగానే సెంచరీలు వస్తుంటాయని తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో, విభిన్న పరిస్థితుల్లో సత్తా చాటేందుకు తన ఫిట్‌నెస్ సహాయ పడుతోందని విరాట్ చెప్పాడు.