ప్రగతిభవన్ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్ ముందు  దంపతుల ఆత్మహత్యాయత్నం

జీడిమెట్ల, వెలుగు: డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని భార్యాభర్తలు ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతులిద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామానికి చెందిన మహేందర్ (40) ఇరవై ఏండ్ల కింద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వలస వచ్చాడు. ప్రగతినగర్​లో నివాసం ఉంటున్నాడు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైందని కూడా సమాచారం వచ్చింది. ఎంతకీ ఇల్లు రాకపోవడంతో కలెక్టర్ ఆఫీస్​కు వెళ్లి విచారించాడు. లిస్ట్​లో పేరు ఉందని కానీ.. పక్కన పెట్టినట్లు అధికారులు చెప్పారు. తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్​ను కలిశాడు. తనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరాడు. అర్హులకు ఇల్లు ఇవ్వడం లేదని గోడు వెల్లబోసుకున్నాడు. 

తెలంగాణ కోసం పోరాటం చేసిన తనకే న్యాయం జరగడం లేదన్నాడు. దీంతో ఎమ్మెల్యే వివేకానంద్​ తనతో దురుసుగా ప్రవర్తించారని, ఇష్టమొచ్చినట్లు తిట్టాడని మహేందర్ వివరించాడు. సీఎం కేసీఆర్​ను కలిసేందుకు వెళ్లినా పోలీసులు అడ్డుకున్నారని చెప్పాడు. దీంతో తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. బంగారు తెలంగాణ కోసం ఉద్యమం చేశానని, కానీ ఉన్నోడికే ఇచ్చే తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అవమానాలు ఎదుర్కొన్నట్లు వివరించాడు. బాధితుడు మహేందర్​ను మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీశ్ రెడ్డి, నిజాంపేట్ అధ్యక్షుడు ఆకుల సతీశ్ పరామర్శించారు. మహేందర్​కు పార్టీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.