వామ్మో.. ఇలా అయితే టమాట కొనేదెలా..? రెండు రోజుల్లోనే కొండెక్కి కూర్చున్న ధరలు.. మరింత పెరిగే ఛాన్స్ !

వామ్మో.. ఇలా అయితే టమాట కొనేదెలా..? రెండు రోజుల్లోనే కొండెక్కి కూర్చున్న ధరలు.. మరింత పెరిగే ఛాన్స్ !

కూర ఏదైనా దాదాపు టమాట ఉండాల్సిందే. కూరగాయలు లేకుంటే కనీసం టమాట చారు, టమాట చెట్నీ చేసుకొనైనా పూట గడుపుతుంటారు సామాన్యులు. అంలాంటిది టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే రేట్లు డబల్ కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండు మూడు రోజుల కింద కిలో టమాట ధర 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండగా.. సడెన్ గా రేట్లు డబల్ అయ్యాయి. 

హైదరాబాద్ లో ప్రస్తుతం కేజీ టమాట ధర రూ.60 నుంచి రూ. 70 కి చేరుకుంది. దీంతో టమాట కొనేదెలా అనే ఆందోళన సామాన్యుల్లో మొదలైంది. నిన్నటి వరకు అందుబాటు ధరల్లో ఉన్న టమాట.. ఉన్నట్లుండి కొండెక్కి కూర్చుంది. హైదరాబాద్ లో ఏ ఏరియాకు వెళ్లినా టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ఇతర జిల్లాల్లో పది రూపాయలు అటు ఇటుగా టమాట లభ్యమవుతోంది.

సడెన్ గా టమాట ధరలు పెరగటానికి కారణం ఇటీవల కురిసిన వర్షాలే అంటున్నారు వ్యాపారులు. భారీ వర్షాల కారణంగా టమాట సప్లై తగ్గిపోయిందని చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా పంటలు డ్యామేజ్ కావడంతో సప్లై తగ్గిపోయింది. టమాట కొరతతో నగరంలో టమాట దాదాపు రూ.70 కి చేరుకుంది. మార్కెట్లకు రోజువారీగా వచ్చే టమాటాలో సగం వరకు కూడా రావటం లేదని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టమాట కూడా తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని టమాట ధరలు 50 నుంచి 60 రూపాయలకు చేరుకున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఇతర జిల్లాలు, రూరల్ ప్రాంతాల్లో 35 నుంచి 45 రూపాయల మధ్య టమాట అమ్ముతున్నారు.