భార్యను చంపి భర్త ఆత్మహత్య..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఘటన

భార్యను చంపి భర్త ఆత్మహత్య..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  జూలూరుపాడు మండలంలో ఘటన

జూలూరుపాడు, వెలుగు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అనుమానంతో భార్యను హత్య చేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ధరావత్‌‌‌‌ గోపి (40)కి ముత్యాలంపాడు గ్రామానికి చెందిన సునీత (37)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

మద్యానికి బానిసైన గోపి భార్యను అనుమానిస్తూ తరచూ వేధించేవాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పలుమార్లు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు మందలించడంతో సఖ్యతగానే ఉంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గోపి, సునీత కలిసి పొలం వద్దకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి వెతకగా... పత్తి చేనులో సునీత డెడ్‌‌‌‌బాడీ కనిపించింది. 

గోపి కోసం వెతకగా ఎక్కడా కనిపించకపోవడంతో... భార్యను చంపి పారిపోయి ఉంటాడని భావించి సునీత డెడ్‌‌‌‌బాడీని ఇంటికి తరలించారు. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులకు పత్తి చేను సమీపంలో గోపి స్పృహ కోల్పోయి కనిపించడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూసే సరికే చనిపోయాడు. సునీతను చంపిన తర్వాత భయపడి తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.