వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవడమే గాకుండా జీవితభాగస్వామిని సైతం హతమార్చిన ఘటనలు జరుగుతున్నాయి. భర్తను భార్య చంపడం,భార్యను భర్త చంపడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్టోబర్ 24న ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్యను దారుణంగా చంపేశాడు భర్త.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల పరిధిలోని కాలనీ నాచారం గ్రామంలో తాటి రామారావు, గోవర్ధని అనే దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య గోవర్ధని మరో పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త రామారావు గోవర్ధనిని పలుమార్లు మందలించాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దీనిపై ప్రతి రోజు దంపతుల మధ్య గొడవులు జరిగేవి. ఈ క్రమంలోనే ఆగ్రహంతో భర్త రామారావు అక్టోబర్ 24న తన భార్య గోవర్ధనిని గొడ్డలితో నరికి చంపేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త రామారావును అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.
