వివాహితతో పరిచయం ప్రాణం తీసింది

వివాహితతో పరిచయం ప్రాణం తీసింది

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద ఈ నెల 13న జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. శంషాబాద్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ ప్రకాశ్​రెడ్డి వివరాలు తెలిపారు. సిద్ధాంతి రైల్వే గేటు వద్ద ఉండే గాజుల పెద్ద వెంకటయ్య(45) కాచిగూడ పరిసరాల్లో కూలీ పనిచేసేవాడు. మెదక్ జిల్లాకు చెందిన పాలకొల్లు రాజు(38), అతడి భార్య తిరుపతమ్మ ఇద్దరూ కూలీ పని చేసేవారు.

కూలీ అడ్డా దగ్గర వెంకటయ్యకు రాజు భార్య తిరుపతమ్మతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు వెంకటయ్య, రాజు భార్య తిరుపతమ్మతో సన్నిహితంగా  ఉన్నాడు. విషయం తెలుసుకున్న రాజు తన భార్యను తీసుకుని శంషాబాద్ మండలంలోని తొండుపల్లికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. తిరుపతమ్మ తొండుపల్లిలో ఉన్నట్టు తెలుసుకున్న వెంకటయ్య అక్కడికి వెళ్లి పాత పరిచయం దృష్ట్య్యా ఆమెను వేధించసాగాడు. దీంతో తిరుపతమ్మ విషయాన్ని తన భర్త రాజుకు చెప్పింది. రాజు ఈ విషయంలో వెంకటయ్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. వెంకటయ్య కూడా తనుకు అడ్డురావొద్దంటూ రాజును బెదిరించాడు. దీంతో ఎలాగైనా వెంకటయ్యను చంపాలని రాజు స్కెచ్ వేశాడు.

ఈ నెల 13న రాత్రి శంషాబాద్ లో ఉన్న వెంకటయ్య వద్దకు రాజు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఉందానగర్ రైల్వేస్టేషన్ వెనకాల ఉన్న కల్లుదుకాణానికి వెళ్లి తాగారు. అక్కడి నుంచి రాళ్లగూడ రోడ్డులోని వైన్స్ షాప్ కు వెళ్లాడు. ఆ తర్వాత వెంకటయ్య, రాజు కలిసి తొండుపల్లి రైల్వే లైన్ పక్కన గల ఫిరంగి నాలా వద్దకు చేరుకున్నారు. అక్కడ మరోసారి మద్యం తాగిన వెంకటయ్య మత్తులో ఉండగా..రాజు ఓ కర్రతో అతడి తలపై కొట్టి చంపేశాడు. వెంకటయ్యను హత్య చేసి రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  మరుసటి రోజు గుర్తు తెలియని డెడ్ బాడీ తొండుపల్లి వద్ద ఉందని వీఆర్వో జానకీరాం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని డెడ్ బాడీగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్, సీసీ ఫుటేజ్ తో ఆధారాలు సేకరించారు. వెంకటయ్య ఫొటో శంషాబాద్ లోని లేబర్ అడ్డా వద్ద చూసి కొందరు అతడిని గుర్తించారు. వెంకటయ్య కూతురికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంకటయ్య, రాజుకు మధ్య గొడవ గురించి అతడి కూతురు పోలీసులకు తెలిపింది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. వెంకటయ్యను తానే చంపినట్లు రాజు నేరాన్ని విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మంగళవారం నిందితుడు రాజును అరెస్టు చేసిన శంషాబాద్ రూరల్ పోలీసులు అతడిపై ఐపీసీ 302, 201, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.