భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు..దాంపత్యం కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ

భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు..దాంపత్యం కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ
  •     కేసులతో వ్యక్తిగత కక్ష సాధించలేరు
  •     వ్యాజ్యాన్ని  కొట్టివేసిన బెంచ్

న్యూఢిల్లీ: వేరుగా ఉంటున్న భార్యపై ఆమె భర్త ఆర్థిక ఆధిపత్యం చెలాయించడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత కక్ష సాధించడానికి క్రిమినల్ వ్యాజ్యాలు గేట్ వే కావని పేర్కొంది. ఈమేరకు జస్టిస్  బీవీ నాగరత్నం, జస్టిస్  ఆర్.మహదేవన్ తో కూడిన బెంచ్  వ్యాఖ్యానించింది. 

అదనపు కట్నం పేరుతో వేధింపులు, హింసకు గురిచేస్తున్నాడంటూ వేరుగా ఉంటున్న తన భర్తపై భార్య వేసిన కేసును బెంచ్  కొట్టివేసింది. ఈ కేసులో భర్తపై గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు తీర్పును కూడా బెంచ్  పక్కన పెట్టింది. ‘‘తన భర్త ఆర్థిక ఆధిపత్యం చెలాయిస్తున్నాడని ఆయన భార్య కేసు వేసింది. 

అయితే, ఇందులో ఎక్కడా ఆయన తన భార్యను వేధిస్తున్నట్లు, హింసకు గురిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంట్లో భర్తలు తరచూ భార్యలపై ఆధిపత్యం చెలాయిస్తారని, మహిళల ఆర్థిక వ్యవహారాలు కూడా వారే చూస్తారని భార్య వేసిన వ్యాజ్యం మన భారతీయ సమాజానికి అద్దం పడుతున్నది. అయితే, వ్యక్తిగత కక్ష సాధించడానికి ఇలా క్రిమినల్  వ్యాజ్యాలు వేయడం కరెక్టు కాదు. కేసులతో వ్యక్తిగత కక్షలు సాధించలేరు” అని బెంచ్  వ్యాఖ్యానించింది.

 మ్యాట్రిమోనియల్  కేసుల విషయంలో తీర్పు చెప్పేటపుడు, ఆదేశాలు జారీచేసేటపుడు చట్టాలు దుర్వినియోగంకాకుండా కోర్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్  పేర్కొంది. ‘‘తనను వేధిస్తున్నాడని, మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నాడని భర్తపై ఆయన భార్య కావాలనే కేసు వేసినట్లు కనబడుతోంది” అని బెంచ్  తెలిపింది.  

కాగా.. భర్తపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు 2023 ఏప్రిల్ 27న ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వారే కేసును పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్  సూచించింది.