పథకాలు అందలేదని హుస్నాబాద్ ​ఎమ్మెల్యే సతీశ్ ​నిలదీత

పథకాలు అందలేదని  హుస్నాబాద్ ​ఎమ్మెల్యే సతీశ్ ​నిలదీత
  • మళ్లీ గెలిపిస్తే గృహలక్ష్మి కింద ఇండ్లు కట్టిస్తానన్న ఎమ్మెల్యే
  • పదేండ్ల సంది కానిది ఇప్పుడెట్లయితదన్న మంచినీళ్ల బండ గ్రామస్తులు
  • సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలు

హుస్నాబాద్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​ను గురువారం జనాలు తమకు పథకాలు అందలేదని నిలదీశారు. అక్కన్నపేట మండలంలో ప్రచారం చేస్తూ మంచినీళ్లబండకు చేరుకోగానే తమకు ప్రభుత్వ స్కీములు అందలేదన్నారు. ఎవరికీ డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు, గృహలక్ష్మి పథకం, దళితబంధు ఇవ్వలేదని, అన్నీ బీఆర్​ఎస్​ కార్యకర్తలకే ఇచ్చారని, ఇదేం న్యాయమని ప్రశ్నించారు.

తమ గ్రామంలో బొడ్రాయి పండుగ చేసుకుంటే, రూ.లక్ష సహాయం చేస్తానని మాటిచ్చి తప్పారని మండిపడ్డారు. ఊహించని విధంగా ప్రజల నుంచి నిరసన ఎదురుకావడంతో ఎమ్మెల్యే షాక్​కు గురయ్యారు. వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.  ఎమ్మెల్యే వెంట ఉన్న నాయకులు గ్రామస్తులను సముదాయించారు. డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు రానివారికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు కట్టిస్తానని అన్నారు.

మళ్లీ తనకు ఓటు వేసి గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పదేండ్లలో చేయలేనోళ్లు ఇప్పుడు చేస్తారనే నమ్మకమేందని గ్రామస్తులు ప్రశ్నించారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు నిమిషాల్లో సోషల్​మీడియాలో చక్కర్లుకొట్టాయి. హుస్నాబాద్​ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైందని వాట్సాప్​ గ్రూపుల్లో పలువురు వీడియోలు షేర్​ చేశారు. తర్వాత ఎమ్మెల్యే మంచినీళ్లబండ పరిధిలోని యాటకార్లపల్లెతోపాటు టేకులతండా, గొల్లపల్లి, మల్లంపల్లి, మోత్కులపల్లి, పెద్దతండా, చౌటపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని  నిర్వహించారు.