హుస్నాబాద్ కు రింగ్ రోడ్డు..మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు

హుస్నాబాద్ కు  రింగ్ రోడ్డు..మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు
  • మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు
  • సర్వేకు సమాయత్తమవుతున్న అధికారులు
  • పట్టణంలో తీరనున్న  ట్రాఫిక్ సమస్య    

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో ఎంతో కాలంగా ఉన్న డిమాండ్ కు కదలిక వచ్చినట్టయింది. పట్టణం చుట్టూ దాదాపు 20 కిలోమీటర్ల మేర సర్వే చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రింగ్ రోడ్డు వల్ల పట్టణంలోకి భారీ వాహనాల రాకను మల్లించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సిద్దిపేట హన్మకొండ రహదారిలో పందిళ్ల దాటిన తర్వాత రింగ్ రోడ్డు ను ప్రారంభించి  కరీంనగ్ రోడ్డు, హన్మకొండ రోడ్డు, జనగామ రోడ్డు మీదుగా తిరిగి పందిళ్ల వద్ద ముగిసేలా పరిశీలన జరుపుతున్నారు. పట్టణానికి ఓ వైపు ఎల్లమ్మ చెరువు ఉండడంతో రింగ్ రోడ్డు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రధాన రోడ్ల వద్ద ప్రత్యేక జంక్షన్లు నిర్మించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన కార్యరూపం దాలిస్తే రాబోయే కొన్నేండ్లలో రింగ్ రోడ్ మ్యాపింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్​లో రింగ్ రోడ్లు ఉండగా దుబ్బాకలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తుండగా ప్రస్తుతం హుస్నాబాద్ సైతం వాటి సరసన చేరనున్నది. 

రింగ్ రోడ్డుతో తప్పనున్న ట్రాఫిక్ ముప్పు

ప్రస్తుతం సిద్దిపేట హన్మకొండ, హుస్నాబాద్ కరీంనగర్, హుస్నాబాద్ జనగామకు మెయిన్ రోడ్డుతో అనుసంధానం వల్ల భారీ వాహనాలు పట్టణంలోంచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు నేషనల్  హైవే 765 డీజీ సైతం హుస్నాబాద్ మెయిన్ రోడ్డు మీదుగా వెళుతుండడంతో భారీ వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగుతుంటాయి. దీంతో పట్టణంలోని 2 కిలో మీటర్ల మేర మెయిన్ రోడ్డు ఎప్పుడూ ట్రాఫిక్ తో రద్దీగా ఉంటుంది. రింగ్ రోడ్డు నిర్మాణంతో భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా బయటి నుంచి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పట్టణంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. 

భూ సేకరణ అనివార్యం

హుస్నాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తప్పనిసరిగా భూములను సేకరించాల్సి ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్లకు పైగా రెండు వరుసల రింగ్ రోడ్డుకు  కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ భూములను సేకరించాలి. దీంతో భూసేకరణ  విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు  ఎక్కువగా కనిపిస్తున్నాయి. సేకరించే భూములకు పరిహారాలు ఇచ్చినా పట్టణ శివార్లలో భూముల రేట్లు అధికంగా ఉండడంతో ఎంత వరకు అధికారులకు భూయజమానులు సహకరిస్తారనేది తెలియడంలేదు.