నిండుకుండలా హుస్సేన్సాగర్... ఫుల్ట్యాంక్ లెవల్కు చేరిన నీళ్లు

నిండుకుండలా హుస్సేన్సాగర్...  ఫుల్ట్యాంక్ లెవల్కు చేరిన నీళ్లు
  • హిమాయత్​ సాగర్ ​గేట్లు మళ్లీ ఓపెన్​
  • సింగూరు, మంజీరాలోకి భారీగా వరద 

హైదరాబాద్​సిటీ, వెలుగు: వర్షాలకు నగరంలోని రిజర్వాయర్లు, చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. సిటీకి తాగునీటిని అందించే ప్రాజెక్టులతో పాటు అందానికి తలమానికంగా ఉన్న హుస్సేన్​సాగర్​లోకి భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​చేయగా, హుస్సేన్​సాగర్​తూము గేట్ల నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు. హుస్సేన్​సాగర్​ఫుల్​ట్యాంక్​ లెవెల్​కు చేరుకుంది. దీంతో అదనపు నీటిని వైశ్రాయ్, బల్దియా వైపు ఉన్న తూముల గుండా బయటకు వదులుతున్నారు. 

హుస్సేన్​సాగర్​ఫుల్​ట్యాంక్​ లెవెల్​513.14 మీటర్లు కాగా ప్రస్తుతం 513.37 మీటర్ల నీళ్లున్నాయి. కూకట్​పల్లి నాలా నుంచి అధిక ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండగా, 1704 క్యూసెక్కులు హుస్సేన్ సాగర్‌‌‌‌లోకి చేరుతోందని జీహెచ్ఎంసీ లేక్స్ ఇన్​చార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తూముల ద్వారా 869 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 

భారీ వర్షాలు కురిసినా హుస్సేన్ సాగర్‌‌‌‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తేనే నాలాకు సమీపంలోని అశోక్ నగర్, దోమలగూడ, గోల్నాక ప్రాంతాల వారిని ఖాళీ చేయించాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ తూములు సరిగ్గానే పనిచేస్తున్నాయని, ఎలాంటి టెక్నికల్​ఇష్యూస్​లేవన్నారు. వర్షాల కారణంగా మల్కం చెరువు, కూకట్​పల్లి చెరువు, ఇతర చెరువుల్లోకి కూడా భారీగా వరద చేరుతోందన్నారు. 

మళ్లీ హిమాయత్​సాగర్​ గేట్లు ఎత్తిన్రు  

హిమాయత్​సాగర్​లోకి వరద తగ్గడంతో రెండు రోజుల కింది వరకు ఎత్తిన గేట్లను మూసేసి ఒక గేటునే ఎత్తిన అధికారులు బుధవారం మళ్లీ వరద పెరగడంతో అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ భారీగా వరద వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం1,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 3,854 క్యూసెక్కులు మూసీలోకి వదులుతున్నారు. తాజాగా నాలుగు గేట్లను 3 అడుగుల మేర తెరిచి నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో మూసీ కి కూడా మళ్లీ వరద ఉధృతి పెరిగింది. 


ఏ క్షణమైనా మంజీరా బ్యారేజి గేట్ల ఎత్తివేత

గ్రేటర్​కు తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయాల్లో ఒకటైన సింగూరు, మంజీరా జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో 5 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదవుతున్నది. ప్రాజెక్టు పవర్ హౌస్, ప్రాజెక్టు గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదలనున్నారు. 

దీంతో మంజీరా గేట్లనూ ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉందని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు.  దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, పశువులు, గొర్ల  కాపరులు, చేపల వేటకు  పోయే వారు నది లోనికి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.