కరీంనగర్, వెలుగు : హుజురాబాద్ బీఆర్ఎస్‌లో అసమ్మతిరాగం మొదలైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ లీడర్లు, జమ్మికుంటలోని మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌కు చెందిన వెంచర్‌లో శుక్రవారం రాత్రి రహస్యంగా సమావేశం కావడం, అక్కడ లీడర్లు మాట్లాడిన వీడియోలు వైరల్ కావడం పార్టీలో కలకలం రేపింది.
ఃసమావేశానికి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పోడేటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ బాలసాని కుమారస్వామి, కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్ పింగిలి రమేశ్, ఇల్లందకుంట వైస్ ఎంపీపీ చుక్కా రంజిత్, కౌన్సిలర్ బచ్చు శివ కుమార్, మాజీ ఎంపీపీ మమత దుర్గాప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పొన్నగంటి సంపత్, హుజురాబాద్‌మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, సీనియర్ నాయకులు కన్నూరి సత్యనారాయణ, పింగిలి ప్రదీప్ రెడ్డి, మనోహర్‌రావు, శ్రీరామ్‌తో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ పింగిలి ప్రదీప్‌రెడ్డి.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎమ్మెల్యే కింద తాము పనిచేయలేమని, ఆయన దుందుడుకుతనం వల్ల అనవసరంగా తాము కేసుల పాలవుతున్నామని, సీనియర్లంటే కనీస గౌరవం లేదని అసమ్మతి నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మరొకరిని నియమించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ హైకమాండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు వారు సిద్ధమైనట్లు తెలిసింది.
సమావేశ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. పలువురు లీడర్లతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. వారు నిరాకరించినట్లు తెలిసింది. జమ్మికుంట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దిలీప్ ఎన్నికైనప్పటి నుంచే అసమ్మతి రాజుకున్నట్లు సమాచారం.
