హుజూరాబాద్​ బైపోల్​ ఫలితం తేలేది నేడే

హుజూరాబాద్​ బైపోల్​ ఫలితం తేలేది నేడే
  • హుజూరాబాద్​ బైపోల్​ ఫలితం తేలేది నేడే
  • 14 టేబుళ్లు.. 22 రౌండ్లు
  • ఒక్కో రౌండ్​కు 20 నుంచి 30 నిమిషాలు
  • తుది ఫలితం మధ్యాహ్నం 3 గంటల తర్వాతే


హైదరాబాద్ ​/ కరీంనగర్ / కరీంనగర్​ టౌన్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లు సాగిన ఈ బైపోల్​ ఫలితాల కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తున్నది. కౌంటింగ్​కు ఎన్నికల కమిషన్​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం ఐదు మండలాల్లోని 306 పోలింగ్ కేంద్రాల్లో శనివారం పోలింగ్​ నిర్వహించగా.. 86.64 శాతం ఓట్లు పోలయ్యాయి. 2,36,873 మంది ఓటర్లలో 2,05,236 మంది ఓటు వేశారు. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు  753 పోలయ్యాయి. బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్​, టీఆర్​ఎస్​ తరఫున గెల్లు శ్రీనివాస్​, కాంగ్రెస్​ తరఫున బల్మూరి వెంకట్​ బరిలోకి దిగారు. వీరితో కలిపి మొత్తం 30 మంది పోటీ చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. కరీంనగర్​లోని ఎస్ ఆర్ ఆర్  కాలేజీలో కౌంటింగ్​ జరుగనుంది. కౌంటింగ్  స్టాఫ్​కు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ట్రైనింగ్​ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని సీఈవో శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు. కౌంటింగ్ హాల్ దగ్గర గ్యాదరింగ్ కు కూడా అనుమతి లేదన్నారు. ఎన్నికల సిబ్బందికి,  కౌంటింగ్ ఏజెంట్లకు పీపీఈ కిట్లు అందుబాటులో పెట్టినట్లు చెప్పారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే వచ్చి ఎలక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.  కౌంటింగ్​కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం సీఈవో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కాలేజీలోని ఒక్కో హాల్​లో  ఏడు టేబుళ్ల చొప్పున రెండు హాళ్లలో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. తర్వాత ఈవీఎంలలోని ఓట్ల  లెక్కింపు స్టార్ట్​ చేస్తారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని సీఈవో  శశాంక్​ గోయల్​చెప్పారు. ఫస్ట్​ రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు హుజూరాబాద్ మండల ఓట్లు కౌంట్​ చేస్తారు. ఈ మండలంలో మొత్తం ఓట్లు 61, 673 ఉండగా..  ఇందులో 52,827 ఓట్లు నమోదయ్యాయి. తర్వాత ఏడు నుంచి 10 రౌండ్​ వరకు వీణవంక మండలం ఓట్లను లెక్కిస్తారు. ఈ మండలంలో 40, 099 మంది ఓటర్లు ఉండగా.. 35,623 ఓట్లు పోలయ్యాయి. 11 నుంచి 15 రౌండ్  వరకు జమ్మికుంట మండల ఓట్లను కౌంట్​ చేస్తారు. ఈ మండలంలో 59,020 మంది ఓటర్లు ఉండగా..  49,378 ఓట్లు నమోదయ్యాయి. 16  నుంచి  18  రౌండ్​ వరకు ఇల్లందకుంట మండలం ఓట్లను లెక్కిస్తారు.  ఈ మండలంలో 24, 799 మంది ఓటర్లు ఉండగా.. 22,501 ఓట్లు పోలయ్యాయి. చివరగా 19 నుంచి  22 రౌండ్​లో కమాలాపూర్ మండల ఓట్లను కౌంట్​ చేస్తారు. ఈ మండలంలో 51, 282 మంది ఓటర్లు ఉండగా..  44, 907 మంది ఓటు వేశారు. 
ట్రాఫిక్ ​మళ్లింపు 
కౌంటింగ్ టైమ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో జగిత్యాల నుంచి కరీంనగర్ కు వచ్చేవాళ్లను  రేకుర్తి, శాతవాహన యూనివర్సిటీ, చింతకుంట,  పద్మనగర్, గీతాభవన్ మీదుగా బస్టాండ్ వైపుకు వెళ్లే విధంగా దారి మళ్లించారు.  కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లేవాళ్లు  గీతాభవన్, పద్మనగర్, చింతకుంట, శాతవాహన యునివర్సిటీ, రేకుర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుందని  ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. 
పకడ్బందీగా కౌంటింగ్​: కలెక్టర్​
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని ఆఫీసర్లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి కౌటింగ్​ ప్రక్రియపై ట్రైనింగ్​ ఇచ్చారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ ల లోని స్లిప్పు లను కూడా లెక్కించాల్సి ఉంటుందని, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల లెక్క సరిగ్గా ఉండేలా చూడాలని కలెక్టర్​ చెప్పారు.  ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణ శంకర్ నారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ను సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి సిహెచ్. రవీందర్ రెడ్డి కౌంటింగ్ ప్రక్రియ లోని పలు అంశాలపై కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ రాజేందర్ రెడ్డి   సమగ్ర శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొని కౌంటింగ్ సిబ్బంది అందరికీ కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. 
ఆ ఆఫీసర్​ తీసుకెళ్లింది డిఫెక్టివ్​ వీవీప్యాట్: సీఈవో​
వీవీప్యాట్ తీసుకెళ్తున్న వీడియో క్లిప్ పై డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసినట్లు సీఈవో శశాంక్​ గోయల్​చెప్పారు. ఆ వీవీప్యాట్ కు, పోలింగ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. డిఫెక్టివ్ వీవీ ప్యాట్​ను వాహనంలో పెట్టేందుకు ఆఫీసర్  తీసుకుని వెళ్లారని, దీనిపై కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్లు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే ఎన్నికలు సజావుగా పూర్తి చేస్తామని సీఈవో చెప్పారు. 


ర్యాలీలకు అనుమతి లేదు
విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని సీఈవో శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు. కౌంటింగ్ హాల్ దగ్గర గ్యాదరింగ్ కు కూడా అనుమతి లేదన్నారు. ఎన్నికల సిబ్బందికి,  కౌంటింగ్ ఏజెంట్లకు పీపీఈ కిట్లు అందుబాటులో పెట్టినట్లు చెప్పారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే వచ్చి ఎలక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.  కౌంటింగ్​కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం సీఈవో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం
ఉదయం 8 గంటలకు పోస్టల్​ బ్యాలెట్ల కౌంటింగ్​ మొదలు పెట్టి.. వీటిని అరగంటలో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఒక్కో టేబుల్ లో ఉన్న ఈవీఎం లను ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి కౌంట్​ చేస్తారు.  ఒక్కో రౌండ్  కౌంటింగ్​కు  20 నుంచి 30 నిమిషాల టైమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. గెలుపు ఓటములపై  మధ్యాహ్నం 12 గంటల వరకు ఓ క్లారిటీ రానుంది. మధ్యాహ్నం 3 గంటల  తర్వాత తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.  ప్రతి టేబుల్ కు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిని పర్యవేక్షించేందుకు అధికారులను నియమించారు.