మీ ఆటలు  సాగయ్​.. కరోనా సమయంలో రాజకీయాలా.?

మీ ఆటలు  సాగయ్​.. కరోనా సమయంలో రాజకీయాలా.?

 

  •     తెలంగాణకు చైతన్యాన్ని నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నరు 
  •     ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి మంత్రిగా బెదిరిస్తున్నడు 
  •     కరోనా సమయంలో రాజకీయాలు, వెకిలి చేష్టలా? 
  •     ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ‘ఊర్లల్లో కరోనా సోకి అనేక మంది చనిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్ పెట్టారు. కానీ కరీంనగర్​లో మాత్రం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు. గొర్ల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు హుజూరాబాద్ ప్రజా ప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ​విమర్శించారు. వీటిని ఇకనైనా ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘20 ఏండ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి, చైతన్యాన్ని నింపి, ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన గడ్డ మీద కుట్ర చేస్తున్నరు. ఉద్యమంతో సంబంధం లేని మంత్రి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. 

అదే పనిగా సర్పంచ్​లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి డబ్బు ఆశ చూపడం, ప్రలోభాలకు గురి చేయడం, బిల్లులు రావని బెదిరించడం చేస్తున్నారు. వాళ్లకు ఇష్టం లేకున్నా నాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు’ అన్నారు. ‘పిడికెడు మంది స్టేట్​మెంట్​ఇచ్చినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని మారుస్తనని అనుకోవడం వెర్రి బాగులతనం. హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవం ఉన్నవారు. ఇలాంటి చిల్లర మల్లర చర్యలు తిప్పికొడతారు’ అని చెప్పారు.

మా వాళ్లను ఇబ్బంది పెడితే సహించ

20 ఏళ్ల నుండి కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురిచేస్తే సహించబోనని ఈటల హెచ్చరించారు. ‘కరోనా పేషెంట్లను కాపాడండి. ఇలాంటి చిల్లర పనులు, వెకిలి చేష్టలు చేయకండి’ అన్నారు. ఇలాంటి వాటిని హుజూరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ తిప్పికొడ్తారన్నారు. ‘సమైఖ్య రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నం చేసి భంగపడ్డారు. ఇప్పుడు మీకూ ఇది తప్పదు. కరెక్టు టైమ్​లో ఘోరీ కడ్తరు’ అన్నారు. ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే కొందరు మాట్లాడుతుండొచ్చు గాని వారి అంతరాత్మ తనతోనే ఉంటుందన్నారు. 20 ఏళ్లుగా తనతో నడిచిన వారందరినీ కాపాడుకుంటానని చెప్పారు.