హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యపేట జిల్లా హుజూర్ నగర్లో 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో 2,160 ఇండ్లతో మోడల్ కాలనీని నిర్మించినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రామస్వామి గుట్ట వద్ద ఉన్న మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ.2 కోట్లతో డ్రైనేజీ, రూ.1.50 కోట్లతో కమ్యూనిటీ హాల్, రూ.1.50 కోట్లతో చిల్డ్రన్ పార్క్, రూ.95 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.30 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించే ఆర్చ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం లబ్ధిదారులకు కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మంత్రి, మండలంలోని వేపాల సింగారంలో జరిగిన నూతన దేవాలయాల, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోడల్ కాలనీలో చేపట్టే పనులన్నీ నాణ్యతతో, ఆదర్శంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికను పూర్తి పారదర్శకంగా చేపట్టామని, పనులన్నీ పూర్తయినట్లు కలెక్టర్ నివేదిక ఇవ్వగానే కాలనీ ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. . నేడు హుజూర్ నగర్లో బస్టాండ్ పనుల శంకుస్థాపనకు మంత్రి పొన్నం పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
