
- శ్రీశైలం, సాగర్‌లో రోజూ 32 నుంచి 49 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
- శనివారం 205 మిలియన్ యూనిట్లకు కరెంటు వాడకం
- ఇందులో జెన్కో సరఫరా 91.647 ఎంయూలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైడల్ పవర్ జనరేషన్ గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో కరెంటు ఉత్పత్తిలో హైడల్ పవర్ తాజాగా థర్మల్ పవర్ ను అధిగమించింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కర్నాటకలోని పలు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,28,116 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ హైడల్ పవర్ ప్లాంట్లలో కూడా జనరేషన్ షురూ చేయడంతో జల విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. శ్రీశైలం ఎడమ గట్టుతో పాటు నాగార్జున సాగర్‌లోనూ కరెంటు ఉత్పత్తి జరుగుతోంది.
దీంతో రోజూ 32 నుంచి 49.284 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వరకు కరెంటు సరఫరా జరుగుతోంది. హైడల్ పవర్ జనరేషన్‌కు తక్కువ ఖర్చు అవుతుండడంతో డిస్కంలకు అగ్గువకే నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 742.66 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటు ఉత్పత్తి జరిగిందని జెన్ కో గణాంకాలు తెలిపాయి. వర్షాలతో గృహ వినియోగం భారీగా తగ్గడం, అగ్రికల్చర్ వినియోగం కూడా కొంత తగ్గడంతో రాష్ట్రంలో శనివారం 205.063 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇందులో జెన్ కో మొత్తం 91.647 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా ఈ సరఫరాలో థర్మల్ పవర్ 42.363 మిలియన్ యూనిట్లు కాగా హైడల్ వపర్ 49.284 మిలియన్ యూనిట్లు. శనివారం థర్మల్ పవర్ కన్నా జలవిద్యుత్ ఎక్కువగా సరఫరా చేశారు.
నారాయణపూర్, శ్రీశైలం నుంచి భారీగా నీరు విడుదల
కృష్ణా నదిపై భాగంలోని ఆల్మట్టి నుంచి 80 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1,18,400 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,03,219 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాలకు 1.80 లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 93 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టులోకి కెపాసిటీ కన్నా ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం 1,28,116 క్యూసెక్కుల నీటిని పవర్ హౌజ్ ద్వారా కిందికి వదిలారు.
ఈ వరద నీటి నుంచి శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న 900 మెగావాట్ల హైడల్ జనరేషన్ ప్లాంట్‌లో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటిని వదులుతుండడంతో నాగార్జున సాగర్‌లోకి రోజూ 93,115 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో రోజూ 35,749 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే నీటితో సాగర్‌లోని 815 మెగావాట్ల హైడల్ జనరేటింగ్ స్టేషన్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్లాంట్ నుంచి కరెంటు ఉత్పత్తి జరుగుతోంది.
900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న శ్రీశైలం ఆరు హైడల్ ప్లాంట్ల నుంచి రోజుకు 17.38 నుంచి 17.75 ఎంయూల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 815 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు పవర్‌ప్లాంట్ నుంచి శనివారం ఒక్కరోజే 16.37 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ ఉత్పత్తి జరిగింది. అలాగే 234 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అప్పర్ జూరాల నుంచి 3.69 నుంచి 4.19 ఎంయూలు, 240 మెగావాట్ల లోయర్ జూరాల నుంచి 4.48 నుంచి 4.59 ఎంయూల కరెంట్ ఉత్పత్తి అవుతోంది.