
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఇష్టం లేని కాలేజ్ లో చేర్పించారని మనోవేదనకు గురైన ఓ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఉమర్ ఖాన్ గూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కపింద్ర శ్యామల్ కొన్నేళ్ల క్రితం తన ఫ్యామిలీతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ఉమర్ఖాన్ గూడలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. ఆయన భార్య ఇంటి వద్దే ఫుట్వేర్షాపు నిర్వహిస్తోంది. వీరి కూతురు ప్రియదర్శిని శ్యామల్(18) ఈ ఏడాదే ఇంటర్ పూర్తి చేసింది.
తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కాలేజ్ లో చేర్పించారు. అయితే తనకు ఇష్టం లేని కాలేజీలో చేర్పించారని మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి వచ్చిన తల్లిదండ్రలు తమ కూతురి డెడ్‌బాడీని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.