గండిపేట, వెలుగు: నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళా ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. ఒమన్ ఎయిర్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అధికారులు వారి పాస్‌పోర్టులు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించగా, వారు సమర్పించిన వీసాలన్నీ నకిలీవని గుర్తించారు. దీంతో వెంటనే మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
మాకేం తెల్వదు.. ఏజెంట్ ఇప్పించిండు..
తాము అమాయకులమని, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఓ ఏజెంట్‌ను నమ్మి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించామని పట్టుబడ్డ మహిళలు అధికారులు తెలిపారు. ఆ ఏజెంట్ నకిలీ వీసాలు ఇచ్చి తమను మోసం చేశాడని పోలీసుల వద్ద వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ వీసాలు సృష్టించిన ప్రధాన ఏజెంట్ ఎవరు? అతడి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
