అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర అన్నం తినలేం

అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర అన్నం తినలేం
  • తినడానికి ఇబ్బంది పడుతున్న సిటిజన్లు
  • పట్టించుకోని బల్దియా సిబ్బంది, అధికారులు 

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలోని అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. చెత్త, మురుగు నీటి కారణంగా క్యాంటీన్ల చుట్టుపక్కల కంపు కొడుతోంది. ఈగలు, దోమలు ముసురుకుంటున్నాయి. దీనిపైచర్యలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో.. కంపు కొడుతున్న ప్రాంతంలోనే జనాలు అన్నం తినాల్సిన పరిస్థితి నెలకొంది.

అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా..

పేదల ఆకలి తీర్చేందుకు సిటీలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5కే భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.  జీహెచ్‌‌ఎంసీ ఈ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. మంచి ఫుడ్ అందిస్తామని చెప్పిన అధికారులు ఆ క్యాంటీన్ల దగ్గర క్లీనింగ్ ను మాత్రం పాటించడం లేదు. క్యాంటీన్‌‌ చుట్టూ ఉన్న చెత్తని క్లీన్​చేయాలని ఆఫీసర్లకు నిర్వహకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. క్లాంటీన్​పరిసరాలను చూసి తినడానికి వచ్చిన కొంతమంది వెనక్కి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

ఈగలు, దోమలు

ఉస్మానియా దవాఖానాకు ఆనుకొని ఉన్న క్యాంటీన్‌‌కు వివిధ జిల్లాల నుంచి పేషెంట్ల సహాయకులు వస్తుంటారు. అయితే నిర్వాహకులు ఈగలు, దోమల మధ్యే వడ్డిస్తున్నారని, చెత్త వాసనలోనే భోజనం చేయాల్సి వస్తోందని వారు అంటున్నారు. బల్దియా నిర్లక్ష్య వైఖరిపై పలువురు మండిపడుతున్నారు. అఫ్జల్‌‌గంజ్‌‌లో ఉన్న సెంట్రల్‌‌ లైబ్రరీకి ప్రతిరోజు వందల మంది నిరుద్యోగులు వచ్చి చదువుకుంటారు. వారిలో చాలా మంది మధ్యాహ్న భోజనాన్ని అక్కడి అన్నపూర్ణ క్యాంటీన్‌‌ వద్ద తింటుంటారు. అయితే, పరిసరాల్లో మురుగు వాసన భరించలేక లైబ్రరీ లోపలికి వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

క్లీన్​చేస్తలేరు

ప్రతిరోజు 350 మీల్స్‌‌ అమ్ముతం. ఎక్కువగా ఉస్మానియా ఆసుపత్రి నుంచి, బేగంబజార్​కు షాపింగ్​కు వచ్చిన వాళ్లు ఈ క్యాంటీన్​కు వస్తుంటరు. కానీ ఇక్కడి చెత్తను బల్దియా క్లీన్​చేస్తలేరు. మేం ఎన్నిసార్లు బల్దియా అధికారులు, సిబ్బందికి చెప్పినా కూడా చెత్తను తొలగిస్తలేరు. ఈ చెత్తను చూసి కొంతమంది తినడానికి కూడా రావట్లేదు. 
– శ్రీనివాసులు, క్యాంటీన్‌‌ నిర్వాహకుడు, ఉస్మానియా ఆసుపత్రి

పరిస్థితి దారుణంగా ఉంది

కామారెడ్డి నుంచి ఉస్మానియా దవాఖానకు వచ్చినం. రూ.5కే భోజనం కాబట్టి తినడానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్యాంటీన్‌‌ పక్కనే చెత్త ఉండి కంపు కొడుతోంది. అధికారులు ఎందుకు చెత్తను తొలగిస్తలేరు?
– శ్రీను, పేషెంట్‌‌ అటెండర్‌‌‌‌