శుక్రవారం ( అక్టోబర్ 24 ) తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగిన తెలిసిందే. బైకును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమయ్యింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైకు ఢీకొన్న బస్సు 300 మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసులు వీరే:
- శివ - గచ్చిబౌలి
- గ్లోరియా ఎల్ శ్యామ్ - గచ్చిబౌలి
- అశ్విన్ రెడ్డి - బీరంగూడ
- ఎం. సత్యనారాయణ - గండిమైసమ్మ
- సుబ్రహ్మణ్యం - బహదూర్ పల్లి
- ప్రశాంత్ - సూరారం
- గుణసాయి - సూరారం
- ఆర్గ బందోపాధ్యాయ్ - మియాపూర్
- అందోజు నవీన్ కుమార్ - వనస్థలిపురం
- గుండా వేణు - చింతల్
- శ్రీహర్ష - నిజాంపేట్
మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు ఫిట్ నెస్ కాలం చెల్లింది కావడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హైవేపై వెళ్తున్న వాహనదారులు కూడా సాహయం చేసినట్లు బస్సు నుంచి బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయలేదని.. కనీసం అలర్ట్ చేసి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడేవారని అంటున్నారు.
►ALSO READ | హైదరాబాద్ టు బెంగళూరు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. కలెక్టర్ రియాక్షన్ ఇదే !
ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని.. బస్సు బైకును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు ముందుభాగం నుంచి మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ తమను లేపలేదని, తామే మంటలు గమనించి లేచామని చెబుతున్నారు ప్రయాణికులు. ఎమర్జెన్సీ డోర్ కూడా తెరుచుకోలేదని.. అద్దాలు బ్రేక్ చేసి బయటకు దూకామని చెబుతున్నారు ప్రయాణికులు.
