రెండ్రోజుల కిందట మిస్సింగ్..చెరువులో తేలిన బాలుడి డెడ్​బాడీ

రెండ్రోజుల కిందట మిస్సింగ్..చెరువులో తేలిన బాలుడి డెడ్​బాడీ
  •   గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చెరువులో మునిగి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం కుర్లీ గ్రామానికి చెందిన బాయమ్మవార్ మల్కయ్య, బాలమణి దంపతులు. ఉపాధి కోసం నానక్ రాంగూడకు వలసవచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉండగా, పెద్ద కొడుకు కార్తీక్(14) నానక్ రాంగూడలోని ప్రభుత్వ బడిలో ఏడో తరగతి చదువుతున్నాడు. 

సోమవారం ఉదయం మల్కయ్య, బాలమణి కూలీ పనులకు వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు తిరిగి వచ్చారు. ఇంట్లో కార్తీక్ కన్పించకపోవడంతో సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

అయితే, బుధవారం ఉదయం విప్రో లేక్ ( వెంకటయ్య చెరువు)లో ఓ బాలుడి మృతదేహం తేలి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు మృతుడిని కార్తీక్ గా గుర్తించారు. చెరువు గట్టుపై బట్టలు ఉండడంతో బాలుడు నీటిలోకి దిగి ఈత రాక మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలుడితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.