బాలుడి చెవిని కొరికేసిన కుక్క

బాలుడి చెవిని కొరికేసిన కుక్క
  • కార్వాన్​లో ఆలస్యంగా వెలుగులోకి  వచ్చిన ఘటన
  • తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క దాడి
  • సీసీ ఫుటేజ్ వీడియో వైరల్

 హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో కుక్కల దాడులు ఆగడంలేదు. కార్వాన్ లో రెండున్నరేండ్ల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేసింది. చెవిని పూర్తి కొరకడంతో చిన్నారి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడిపై కుక్క దాడి చేసిన సీసీ పుటేజ్ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4న కార్వాన్ లోని బాంజావాడీలో ఉండే అఖిల తన కొడుకు వేదాన్ష్​(2)తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వస్తోంది. ఓ వీధి కుక్క వేదాన్ష్ పై దాడి చేసింది. అఖిల వెంటనే కుక్కను తరిమేందుకు యత్నించగా.. ఆమెపై కూడా దాడి చేయబోయింది. స్థానికులు వెంటనే కుక్కను తరిమికొట్టారు. కుక్క దాడిలో వేదాన్ష్ చెవికి తీవ్ర గాయాలయ్యాయి.  

బాలుడిని వెంటనే సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు తరలించారు. చెవి పూర్తిగా కట్ కావడంతో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.  ఇందుకు రూ.3.50లక్షల ఖర్చు అయినట్లు వేదాన్ష్ తండ్రి వెంకటేశ్ తెలిపారు. గురువారం డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. వేదాన్ష్ తండ్రి వెంకటేశ్ సైఫాబాద్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బల్దియా వెటర్నరీ అధికారులు, సిబ్బంది అంతా ఎలక్షన్స్ విధుల్లో బిజీగా ఉండటంతో కుక్కల నియంత్రణపై పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

9 ఏండ్ల బాలుడిపై కుక్కల దాడి

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో తొమ్మిదేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. శుక్రవారం స్కూల్‌  నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సాయికుమార్..  దుకాణానికి వెళ్లగా ఐదు కుక్కలు అతనిపై దాడిచేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు సుల్తానాబాద్  హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో కరీంనగర్ తీసుకెళ్లారు.