జంతువులపై నో ట్రయల్స్..

జంతువులపై నో ట్రయల్స్..

వెలుగు: ఓ మందు బయటకు రావాలంటే ఎన్నెన్నో పరీక్షలను ఎదుర్కోవాలి . ఆ పరీక్షల్లోనే జంతువులకూ పరీక్ష ఎదురవుతోంది. అంటే, ప్రతి మందు శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ‘క్లినికల్ ట్రయల్స్​’ చేస్తారు. దానికి జంతువులే ముందు బలైపోతున్నాయి. అయితే, నైతికంగా అది ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. జంతు ప్రేమికులూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే జంతువులపై  క్లినికల్ ట్రయల్స్​ చేయకుండా సరికొత్త మార్గాన్ని హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ ) సైంటిస్టులు కనుగొన్నారు.

జంతువులపై కాకుండా ల్యాబ్ లో తయారుచేసిన మానవ అవయవాలపై ట్రయల్స్​ చేసేలా పరిశోధనలు చేస్తున్నట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అందుకు తగ్గట్టు హ్యూమన్​ సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థతో గురువారం ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు.

మానవ కణాలతో ల్యాబ్లో అవయవాలను తయారు చేసి, వాటిపైనే సక్సెస్ ఫుల్ గా క్లినికల్ ట్రయల్స్​ చేయడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇప్పటికే కొందరు సైంటిస్టులు దేశంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారన్నారు. వాళ్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి మంచి ఫలితాలు పొందుతామని చెప్పారు. దాంతో పాటే కృత్రిమ మాంసం తయారీపైనా ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పారు. జంతువుల కణాల నుంచి మాంసం తయారు చేస్తామన్నారు. ఆయా ప్రయోగాలకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు బయోటెక్ నాలజీ డిపార్ట్​మెంట్ (శాస్ర్త, సాంకే తిక మంత్రిత్వశాఖ) ఒప్పుకుందన్నారు.