ఇక ఈజీగా, ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా కరోనా టెస్ట్

ఇక ఈజీగా, ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా కరోనా టెస్ట్
  • సీసీఎంబీ డ్రైస్వాబ్ ఆర్టీపీసీఆర్ కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులకు మరింత మెరుగైన ఆర్టీ పీసీఆర్ విధానం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్టీ పీసీఆర్ టెస్టులతో రిజల్ట్స్ కచ్చితంగా వస్తున్నా.. టెస్టు చేస్తున్న విధానం కారణంగా ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సులభంగా ఉండే డ్రైస్వాబ్ ఆర్టీ పీసీఆర్ విధానాన్ని హైదరాబాద్ లోని సీసీఎంబీ అభివృద్ధి చేసింది. ఈ డ్రైస్వాబ్ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్లకు తాజాగా ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీ పీసీఆర్ టెస్టులను ఇప్పుడున్న ల్యాబ్స్, వనరులతోనే 2, 3 రెట్లు ఎక్కువగా పెంచేందుకు వీలు కానుంది. ప్రస్తుతం స్వాబ్ శాంపిల్ ను వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియం (లిక్విడ్)లో పెట్టి ల్యాబ్ కు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయం, ఖర్చు పెరుగుతున్నాయి. అందుకే లిక్విడ్ లో పెట్టాల్సిన అవసరం లేకుండా టెస్టు చేసే విధానాన్ని సీసీఎంబీ అభివృద్ధి చేసింది. డ్రైస్వాబ్ విధానం ద్వారా చాలా త్వరగా, కచ్చితమైన రిజల్ట్ వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఐసీఎంఆర్ ఆమోదం లభించడంతో దేశవ్యాప్తంగా 500 ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ లకు ఈ టెస్టు చేయడంలో సీసీఎంబీ ట్రైనింగ్ ఇవ్వనుంది.  
డ్రైస్వాబ్ టెస్టులు ఈజీ, ఖర్చు తక్కువ 
ఇప్పుడున్న ఆర్టీ పీసీఆర్ టెస్టులతో పోలిస్తే.. సీసీఎంబీ రూపొందించిన డ్రైస్వాబ్ ఆర్టీపీసీ ఆర్ టెస్టులతో రిజల్ట్స్ త్వరగా వస్తాయి. ఎక్కువ టెస్టులు చేయొచ్చు. రిజల్ట్స్ త్వరగా రావడంవల్ల పాజిటివ్ వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ టెస్టులతో ఖర్చు కూడా తగ్గుతుంది. -డాక్టర్ రాకేశ్ మిశ్రా, సీసీంఎబీ డైరెక్టర్