హైదరాబాదు నుంచి చెన్నై వరకు ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు మార్గం రాబోతోంది. దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన ప్రణాళికను తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ముంబై అహ్మదాబాద్ రూట్ తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రధాన ఆర్థిక వృద్ధి ప్రాంతాల్లో కూడా వేగవంతమైన రవాణా వ్యవస్థ విస్తరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు గూడూరు మార్గాన్ని తప్పించి తిరుపతిలో ప్రత్యేక స్టాప్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు మార్చినట్లు చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి జయకుమార్ పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణించాలనుకునే వ్యక్తులు వేగంగా తమ గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు.
మెుత్తం 778 కిలోమీటర్లు ఉండనున్న ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాదు-చెన్నై ప్రయాణ సమయం ప్రస్తుత 12 గంటల నుంచి జస్ట్ 2 గంటలు 20 నిమిషాలకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో ఈ మార్గం చెన్నై సెంట్రల్, మింజూరు స్టేషన్లలో ఆగనుంది. ఇందుకోసం ప్రతి స్టేషన్ చుట్టూ 50 ఎకరాల్లో వాణిజ్య సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ జోన్లను అభివృద్ధి చేయాలని రైల్వే డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తోంది.
తమిళనాడులో 61 కిలోమీటర్ల ప్రయాణ మార్గంలో 11.6 కిలోమీటర్ల పొడవు గల టన్నెల్ నిర్మాణం అత్యంత సవాలుగా పేర్కొంది రైల్వే. అలాగే 223.44 హెక్టార్ల భూభాగంలో ఎటువంటి అటవీ ప్రాంతాలు లేవని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ అంశం పర్యావరణ అనుమతుల ప్రక్రియను సులువు చేస్తుందని చెబుతున్నారు. ఈ హైస్పీడ్ రైలు మార్గం దక్షిణ భారతదేశంలో ప్రతిపాదించబడిన రెండు ప్రధాన కారిడార్లలో ఒకటి. మరొకటి హైదరాబాద్-బెంగళూరు మార్గం. ఈ రెండు రూట్స్ కలిపి ముంబయి-అహ్మదాబాద్ లైన్ తరువాత దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే విస్తరణకు కీలకంగా మారనున్నాయి. చెన్నైకి ఇది దక్షిణ రైల్వే నెట్‌వర్క్‌లో కీలక కేంద్రమవ్వడానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
