చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.. నిత్యం ఏదో వెరైటీ నాన్ వెజ్ ఉండాల్సిందే.. పండగనిలేదు.. పబ్బం అని లేదు.. మరి అలాంటి వారు రోజూ ఒకే రకమైన చికెన్ తింటే బోరు కదా.. అలాంటి కొత్తగా వెరైటీగా హైదరాబాద్.. అమృత్సర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. .
హైదరాబాద్ చికెన్ తయారీకి కావలసినవి
- చికెన్ :కేజీ
- కొబ్బరి తురుము: 1/2 కప్పు
- ఉల్లిగడ్డ తరుగు: 11/2కప్పు
- కొబ్బరి పాలు: 1/2 కప్పు
- టొమాటో గుజ్జు :1/2 కప్పు
- ఎండుమిర్చి :20గ్రా.
- జీలకర్ర :1 టీస్పూన్
- మెంతులు: 1 టీస్పూన్
- ధనియాలు: 2టే బుల్ స్పూన్లు
- దాల్చినచెక్క: 4ముక్కలు
- పోక ముక్క (పచ్చివక్క): చిన్నది
- జీడిపప్పు తరుగు :3 టేబుల్ స్పూన్లు
- నూనె: 4 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి ముద్ద: 1టేబుల్ స్పూన్
- చక్కెర: 2 టీస్పూన్లు
- నిమ్మరసం: 2టేబుల్ స్పూన్లు
- యాలకులు :4
- ఉప్పు :తగినంత
- లవంగాలు:6
- పుదీనా: 4 రెమ్మలు
తయారీ విధానం: మిక్సీలో కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు. ధనియాలు, దాల్చిన చెక్క, పోకముక్క, జీడిపప్పు వేసి మెత్తగా పేస్టు చేయాలి. పొయ్యిమీద బాండీ పెట్టి అందులోనూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేసి బంగారు రం గు వచ్చేలా వేగించాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించి మసాల పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేగించాలి. అవి వేగాక అందులో కొబ్బరి పాలు, టొమాటో గుజ్జు వేసి ఒక కప్పు నీళ్లు పోసి వేగించాలి. తరువాత అందులో చికెన్, ఉప్పు వేసి మూత పెట్టి సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా నిమ్మరసం వేసి కలిపి పుదీనాతో గార్నిషింగ్ చేయాలి.
అమృత్సర్ చికెన్ తయారీకి కావలసినవి
- చికెన్ :500 గ్రాములు
- అల్లంవెల్లుల్లి ముద్ద: 2టీస్పూన్లు
- పెరుగు: 3 స్పూన్లు
- నిమ్మరసం :1 టీస్పూన్
- వెనిగర్: 1 టీస్పూన్
- ధనియాలపొడి, జీలకర్ర పొడి, కారం :ఒక్కోటి ఒక టీస్పూన్ చొప్పున
- ఉప్పు: తగినంత
- ఉల్లిగడ్డతరుగు: 1/2కప్పు
గ్రేవీ కోసం
- వెన్న: 5టీ స్పూన్లు
- అల్లం తరుగు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి: ఒక్కోటి ఒక టీస్పూన్ చొప్పున
- ఉప్పు: తగినంత
- పచ్చి మిర్చి తరుగు: 3టీస్పూన్లు
- టొమాటో గుజ్జు : 6
- చక్కెర: 1/2టీస్పూన్
- క్రీమ్: 3టేబుల్ స్పూన్లు
- నీళ్లు :అర కప్పు
- కొత్తిమీర తరుగు: 2టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : ఒక పెద్ద కడాయిలో చికెన్ వేయాలి.. అందులో అల్లం వెల్లులి ముద్ద, పెరుగు నిమ్మరసం, వెనిగర్, థనియాలపొడి జీలకర్రపొడి, కారం, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు వేసి బాగా కలపాలి. చికెన్‌ను రెండు గంటలు నాననివ్వాలి. పొయ్యి మీద బాండీ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేడిచేసి కారం వేసి కలపాలి. తరువాత ధనియాలపొడి, జీలకర్రపొడి, అల్లం తరుగు వేసి వేగించాలి. అందులో కొంచెం నీళ్లు పోసి, ఉప్పు, కారం టొమాటో తరుగు, చక్కెర వేసి బాగా కలిపి ఉడికించాలి. మరో పాన్ లో కొంచెం బటర్ వేసి నాన బెట్టిన చికెన్ అందులో వేసి మూత పెట్టి నీరంతా పోయేలా వేగించాలి. అందులో ముందుగా ఉడకబెట్టిన టొమాటో గుజ్జు వేసి మూత పెట్టి 10నిమిషాలు ఉడికిందాలి. తరువాత ఫ్రెష్ క్రీం వేసి బాగా కలపాలి. పైనుంచి కొంచెం బటర్, కొత్తిమీర వేయాలి.
వెలుగు,లైఫ్
