బక్రీద్ కు సిటీ రెడీ ..ముస్తాబైన ఈద్గాలు, మసీదులు

బక్రీద్ కు సిటీ రెడీ ..ముస్తాబైన ఈద్గాలు, మసీదులు

మెహిదీపట్నం/అబిడ్స్/ముషీరాబాద్, వెలుగు : బక్రీద్ పండుగ కోసం సిటీలోని అన్ని ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్​తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తీసుకొచ్చారు. మెహిదీపట్నం, లంగర్ హౌస్​రింగ్ రోడ్, టోలిచౌకి, జియాగూడ, అంబర్ పేట, కాచిగూడ, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మార్కెట్లకు తీసుకొచ్చారు.

పొట్టేలు జోడీని రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతున్నారు. ప్రత్యేకంగా ఉన్న మేకలు, పొట్టేళ్లు భారీ ధరకు అమ్ముడవుతున్నాయి. వరంగల్, జనగామ, ఇబ్రహీంపట్నం ఏరియాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చిన వ్యాపారులు ముషీరాబాద్ లోని ఏక్ మినార్, పఠాన్ బస్తీ, బోలక్ పూర్ ఏరియాల్లో అమ్ముతున్నారు. ఇక్కడ ఒక మేకను రూ.12 వేల నుంచి 20 వేల మధ్యలో అమ్ముతున్నారు. అయితే, ఈ ఏడాది ధరలు భారీగా పెరిగాయని, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని కొందరు ముస్లిం సోదరులు వాపోతున్నారు. అయితే, ట్రాన్స్ పోర్ట్, ఇతర చార్జీలు కూడా పెరగడంతో మేకలు, గొర్రెల ధరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. బక్రీద్ ప్రార్థనల దృష్ట్యా మీరాలం ఈద్గా వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని పోలీసులు తెలిపారు.

పండుగను ఆనందంగా జరుపుకోవాలి : మంత్రి సబిత

ఇబ్రహీంపట్నం: బక్రీద్ పండగ సందర్భంగా  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్..  ముస్లిం సోదరులకు విషెస్ తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ ను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.