
- ప్రతి రెండో మంగళవారం సమీక్షిస్తా
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు : ప్రజలు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫైల్స్‌ను వెంట వెంటనే క్లియర్ చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల రికార్డ్‌లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లతో సెక్షన్ ల వారీగా పెండింగ్ ఫైల్స్ పై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి మంగళవారం పెండింగ్ ఫైళ్లపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ లోని అన్ని సెక్షన్ల సిబ్బంది పెండింగ్ ఫైల్స్ లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఏవో సదానందం, సెక్షన్ సూపరింటెండెంట్స్, ఆర్ఏ,జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్‌లో వంద శాతం రిజల్ట్ సాధించాలి
టెన్త్ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అనుదీప్ విద్యార్థులకు సూచించారు. షేక్ పేట మండలం బోరబండ పెద్దమ్మ నగర్ లోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. క్లాస్ రూమ్ లకు వెళ్లి విద్యార్థులతో ప్రిపేర్ అవుతున్నారా.. టీచర్లు సరిగా బోధిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆందోళన చెందకుండా కాన్ఫిడెన్స్ తో రాయాలని, స్పెషల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఈవో రోహిణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీత, టీచర్లు ఉన్నారు.