- సీపీ ఆనంద్ పేరుతో 100కు కాల్... వివరాలు చెప్పకుండానే కట్
- జూబ్లీహిల్స్ పోలీసుల ఉరుకులు పరుగులు
హైదరాబాద్: డయల్ 100కి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేరుతో కాల్ వచ్చింది. వివరాలు అడిగే లోపు కాల్ కట్ అయ్యింది. దీంతో పోలీసులు కంగారుపడ్డారు. వెంటనే డయల్ 100 సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులను అలర్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీవీ ఆనంద్ నివాసం ఉండే ఏరియాకు వెళ్లారు. అక్కడ టపాసులు పేల్చుతున్న సౌండ్స్ విన్నారు. కాల్ చేసింది సీపీగా నిర్ధారించుకున్న పోలీసులు... న్యూసెన్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో టపాసులు పేల్చుతూ న్యూసెన్స్ చేస్తున్నవారిని గమనించారు. డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వివరాలు అడిగిన సిబ్బందికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో డయల్ 100 సిబ్బంది జూబ్లీహిల్స్ పీఎస్‌కి సమాచారం అందించారు. ఇదే విషయాన్ని ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. సీపీ పేరుతో కాల్ చేసిన వారి గురించి ఆరా తీశారు. నైట్ డ్యూటీలో ఉన్న డీఐ, ఎస్ఐలు అలర్ట్ అయ్యారు. సీపీ నివాసం ఉంటున్న కాలనీకి సమీపంలోని ఓం నగర్‌లో బోనాలు జరగడం గుర్తించారు. అక్కడకి వెళ్లి టపాసులు కాల్చడాన్ని ఆపించారు. నిర్వాహకులపై పెట్టీ కేసు నమోదు చేశారు.
