సిటీలో ట్రాఫిక్ నిర్వహణకు లేటెస్ట్ పెట్రోలింగ్ బైక్స్, మార్షల్స్

సిటీలో ట్రాఫిక్  నిర్వహణకు  లేటెస్ట్ పెట్రోలింగ్ బైక్స్, మార్షల్స్
  • హెచ్​సీఎస్సీ ఆధ్వర్యంలో 50 బైక్స్ ప్రారంభించిన సీపీ ఆనంద్
  • 100 మంది ట్రాఫిక్​ మార్షల్స్​నియామకం

హైదరాబాద్​ సిటీ, వెలుగు : నగరంలో ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయడానికి పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్స్ ను సీపీ సీవీ ఆనంద్​గురువారం బంజారాహిల్స్​ లోని కమాండ్​కంట్రోల్​సెంటర్​లో ప్రారంభించారు. అలాగే,100 మంది ట్రాఫిక్ మార్షల్స్​కు నియామక ప్రతాలు, దుస్తులు అందజేశారు.   ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో హైదరాబాద్​సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ఆధ్వర్యంలో ట్రాఫిక్​ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

సిటీ కమిషనరేట్​పరిధిలో 650 జంక్షన్లు ఉండగా15వేల వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయన్నారు. ఎనిమిది నెలలకు ముందు సగటు వేగం 18 కిలోమీటర్లు ఉండేదని, ఇది ఇప్పుడు 23 కిలోమీటర్లకు పెరిగినట్టు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. సరైన ట్రాఫిక్​ మేనేజ్​మెంట్​తో ఇది సాధ్యమైందన్నారు. వీఐపీ కాన్వాయ్​మేనేజ్​మెంట్, సిగ్నల్​మేనేజ్​మెంట్, రోప్​మేనేజ్​మెంట్​ వంటి పనుల ద్వారా ట్రాఫిక్​ను నియంత్రిస్తున్నట్టు తెలిపారు.  ట్రాఫిక్​ అసిస్టెంట్లుగా ఇప్పటికే ట్రాన్స్​జెండర్లను నియమించామని గుర్తు చేశారు.

100 మంది ట్రాఫిక్​ మార్షల్స్​ నియామకం 

ట్రాఫిక్​ నియంత్రణకు సిటీలో వంద మంది ట్రాఫిక్​మార్షల్స్​కు శిక్షణ ఇచ్చామని, వీరు ట్రాఫిక్​పోలీసుల లెక్కనే యూనిఫామ్​వేసుకుని డ్యూటీలు చేస్తారన్నారు. లోకల్​ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​పరిధిలో ఉండి పని చేస్తారన్నారు. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజ్​చేయడానికి, వాహనాలు సులభంగా,  వేగంగా వెళ్లేలా మార్షల్స్​ సాయపడతారన్నారు. కార్పొరేట్​సోషల్​రెస్పాన్సిబులిటీలో భాగంగా హైదరాబాద్​సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అపోలో, యశోద, ఎంజే స్కూల్, నిలోఫర్ కేఫ్, సిద్ధార్థ జ్యువెలర్స్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్, షా గౌస్ కేఫ్, మహావీర్ ఎస్టేట్స్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు.  

బల్దియా, ఇతర శాఖల్లో ట్రాన్స్​జెండర్స్​

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ట్రాఫిక్​డ్యూటీల్లో ట్రాన్స్​జెండర్లను నియమించామని, వారు డ్యూటీలు చేస్తున్నారని, భవిష్యత్తులో బల్దియా, ఆర్టీసీతో పాటు ఇతర శాఖల్లో కూడా ట్రాన్స్​జెండర్లకు అవకాశాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో 500 మంది మార్షల్స్​ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  కమిషనర్​ ఆనంద్​ తెలిపారు. హెచ్​సీఎస్సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, అడిషనల్​ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్​ జాయింట్​సీపీ  జోయెల్ డేవిస్ పాల్గొన్నారు. 

బైక్స్​ స్పెషాలిటీ.. 

ప్రతి పెట్రోలింగ్ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు (బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్) ట్రాఫిక్ నిర్వహణకు సహాయపడే అధునాతన  పరికరాలున్నాయని సీపీ తెలిపారు. కాలర్ మైక్రోఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెల్డ్ సెట్, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎల్ఈడీ బ్యాటన్, ఉల్లంఘనను రికార్డ్ చేయడానికి, ఛలాన్లను జారీ చేయడానికి డ్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్ కెమెరా, రియల్ టైమ్ మానిటరింగ్​ఉంటాయన్నారు.