- పోలీస్ అధికారులతో కలిసి వృద్ధాశ్రమంలో న్యూఇయర్ వేడుకలు
పద్మారావునగర్, వెలుగు: ఓల్డేజ్ హోమ్స్ లేని సమాజం రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా, దైవంగా భావించి పూజించాలన్నారు. కొత్త ఏడాదిని ఆడంబరాలకు దూరంగా సేవా దృక్పథంతో జరుపుకోవాలన్న సంకల్పంతో గురువారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని ఆయన సందర్శించారు.
వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి న్యూఇయర్ వేడుకలు జరిపారు. ఆశ్రమంలోని 48 మంది వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లుగా 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ రామకృష్ణను అభినందించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ పగడాల అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేశ్, కార్ఖానా ఇన్స్పెక్టర్ అనురాధ పాల్గొన్నారు.
