
- యజమానితో గొడవ పడుతుండడంతో అటాక్..ఓనరే ఉసిగొల్పాడని ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు : క్రెడిట్ కార్డు బిల్లు వసూలుకు వెళ్లిన ఓ రికవరీ ఏజెంట్‌పై కుక్క దాడి చేసి కరిచింది. తాను క్రెడిట్ కార్డు డబ్బులు అడగడానికి వెళ్లగా కస్టమర్ కుక్కను ఉసిగొల్పాడని ఏజెంట్ చెప్తుండగా, తనపై దాడి చేయడాన్ని చూసి తన కుక్క అటాక్ చేసిందని కస్టమర్ చెప్తున్నాడు. మధురానగర్‌లో ఉండే నందివర్ధన్రావు ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్‌కార్డు వాడుతున్నాడు. కార్డుపై రూ.2 లక్షల వరకు అవుట్స్టాండింగ్ఉంది. ఆ బిల్లు కట్టకపోవడంతో బ్యాంక్ రికవరీ ఏజెంట్ సత్యనారాయణ (38) గురువారం నందివర్ధన్ రావు ఇంటికి వెళ్లాడు. నందివర్ధన్ రావు ఎక్కడున్నాడని వారి కుటుంబ సభ్యులను గట్టిగా అడిగాడు. ఇంట్లో లేడని చెప్పడంతో రికవరీ ఏజెంట్వారిపై అరిచాడు.
ఇంట్లోనే ఉంచుకుని అబద్ధాలాడుతున్నారని తిట్టుకుంటూ వెళ్లిపోసాగాడు. ఈ క్రమంలో ఎదురుపడిన నందివర్ధన్రావు ఏజెంట్ సత్యనారాయణను ఎవరని అడిగాడు. తాను ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ సెక్షన్ నుంచి వస్తున్నానని, బిల్లు కట్టాలంటూ దుర్భాషలాడాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, తన యజమానిని కొడుతున్నాడని గ్రహించిన కుక్క సత్యనారాయణపై దాడి చేసి కాళ్లు, పిక్క కొరికేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.