ముషీరాబాద్, వెలుగు: కుటుంబ కలహాలతో భార్యపై రోకలి బండతో దాడి చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లి జ్యువెలరీ లైన్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఖమ్మం జిల్లాకు చెందిన కుప్పల వెంకటనరేంద్ర, భార్య తేజశ్రీ(28), కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు. అతను అరుణ్ కెమికల్ అండ్ ఫార్మాటికల్ లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం మాటమాట పెరిగి పక్కనే ఉన్న రోకలి బండతో దాడి చేయగా తీవ్ర గాయాలతో తేజశ్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటన అనంతరం నరేంద్ర అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం కోసం డెడ్‌బాడీని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
