నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పీచరలోని గిరిజన ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువులు సాగిస్తున్నారు. దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన స్కూల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిత్యం భయాందోళనలో గడుపుతున్నారు.
రెండేండ్ల క్రితం భవనానికి కొంతమేర రిపేర్లు చేసినప్పటికీ సమస్య పూర్తిగా తీరకపోగా.. గోడలకు మరింత పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయి. బడికి వెళ్తున్న తమ పిల్లలు ఏ క్షణంలో ఏ ప్రమాదానికి గురవుతారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
