- ఒక పార్టీకి అనుబంధంగా ఈసీ పనిచేస్తోంది: దానం
నారాయణగూడ, వెలుగు: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. సర్ ప్రక్రియ ప్రారంభం నుంచే తప్పులతడకగా సాగుతోందని ఆరోపించారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లో మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే 81 వేల మందికి సర్ నోటీసులు అందాయని తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాయడం సరికాదని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత తమలోని నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని దానం నాగేందర్ సూచించారు. ఇలాంటి జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
