ఇద్దరు సైబర్ చీటర్స్ అరెస్ట్

ఇద్దరు సైబర్ చీటర్స్ అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఇద్దరు ఏపీకి చెందిన చీటర్స్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ కు సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్ చేసి.. హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో ప్రమేయం ఉందని బెదిరించారు. నకిలీ అరెస్ట్ వారెంట్ పంపించి , డిజిటల్ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. భయపడిన బాధిత వృద్ధుడు రూ.59 లక్షలు స్కామర్స్ అకౌంట్ లకు పంపాడు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 

కేసు దర్యాప్తు చేపట్టిన పోలిసులు ప్రధాన నిందితుడికి సహకరిస్తున్న ఏపీ కాకినాడ ప్రాంతానికి చెందిన సూరంపూడి చంద్రశేఖర్(31), ఏమండి వెంకట్ నవీన్(25)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి బ్యాంక్ అకౌంట్ లలో డబ్బులు బదిలీ చేయించి... వాటిని క్రిప్టో కరెన్సీ గా మారుస్తూ , ప్రధాన నిందితుడి నుంచి కమిషన్ లు సేకరిస్తున్నట్లు గుర్తించారు. వీరిపై ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 65 కేసులు, తెలంగాణలో 5 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద ఐదు ఫోన్లు, 4 చెక్ బుక్​లు, పది డెబిట్ కార్డులు, మూడు పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.