హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖైరతాబాద్, వెలుగు: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం బంజారాహిల్స్ శ్రీరామ్ నగర్​లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, బస్తీ దవాఖానకు ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ ​విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫంక్షన్ హాల్, బస్తీ దవాఖానతోపాటు అంగన్ వాడీ కేంద్రం, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్నేండ్లుగా ఇక్కడి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, స్థానిక కార్పొరేటర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కృషితో పనులు మంజూరయ్యాయని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తా, దీన్​దయాల్ నగర్, గౌరీ శంకర్ నగర్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ తదితర ప్రాంతాల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ రజనీకాంత్ రెడ్డి, ఈఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలె : రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సిద్ధం కావాలని, బూత్ స్థాయి నుంచి పనిచేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ కార్యకర్తలకు సూచించారు. ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ సెగ్మెంట్ల బీజేపీ కన్వీనర్లు గా నియమితులైన రమేష్ రాము, కందాడి నాగేశ్వర్ రెడ్డి, కాసాని శ్రీశైలం గౌడ్ గురువారం అశోక్​​నగర్ లోని లక్ష్మణ్ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వారిని సన్మానించి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు  జనాలకు వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని,  కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ స్కీమ్స్ పై జనాల్లో  అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

పబ్లిక్ పాలసీ రీసెర్చ్​ను బలోపేతం చేస్తం : ఫ్రొ. లింబాద్రి  

గచ్చిబౌలి, వెలుగు: పబ్లిక్ పాలసీ రీసెర్చ్​ను తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం చేస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో   ‘75 ఇయర్స్​ ఆఫ్​పబ్లిక్​ పాలసీ ఇన్​ ఇండియా–ఏ రెట్రొస్పెక్టివ్ ​అనాలసిస్​’ పేరుతో  రెండ్రోజుల నేషనల్ సెమినార్ గురువారం ప్రారంభమైంది. పొలిటికల్​ సైన్స్ ​విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్ కు చీఫ్​గెస్ట్​గా హాజరైన లింబాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనా శాస్త్ర కోర్సును ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పెట్టామని, దీన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రొఫె సర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు, విదేశీ శక్తులు ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తూ, ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. సెమినార్ లో అంతర్జాతీయ ప్రభుత్వ పాలనా సంస్థ ప్రధాన కార్యదర్శి ఫిలిప్ జిట్టాన్ (ఫ్రాన్స్), హెచ్​సీయూ పొలిటికల్ సైన్స్ హెచ్​వోడీ ప్రొఫెసర్ ఖాన్ సుహాన్, సెమినార్ కో- ఆర్డినేటర్  వీరబాబు, పలువురు ప్రొఫెసర్లు, ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్లు పాల్గొన్నారు.

బేకరీలో పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్.. రూ. 10 వేల ఫైన్ 

మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని బేకరీలు, హోటళ్లలో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ జానకి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. మేడిపల్లిలోని పార్క్ బేకర్స్​లో తనిఖీ చేసిన అధికారులు లోపల క్లీన్​గా లేకపోవడం, నిల్వ ఉంచిన ఆయిల్​తో చేసిన ఫుడ్ ఐటమ్స్, చికెన్, ఇతర స్నాక్ ఐటమ్స్​ను ఐస్​క్రీమ్​లను గుర్తించి సీజ్ చేశారు. శానిటేషన్ ఇన్​స్పెక్టర్​ జానకి మాట్లాడుతూ.. బేకరీల్లో ఎప్పటికప్పుడు తయారు చేసిన కేకులను మాత్రమే అమ్మాలన్నారు. పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్ అమ్మకాలు, నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వాడకం, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవడంతో పార్క్ బేకర్స్​కు రూ.10 వేల ఫైన్ విధించామన్నారు. మరోసారి ఇలాగే ఉంటే బేకరీని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

రైల్వే బోర్డు మెంబర్ మంగ్లా

సికింద్రాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వే టెక్నాలజీలో దూసుకెళ్తోందని రైల్వే బోర్డు మెంబర్​ఆర్.​కె. మంగ్లా అన్నారు. కమ్యూనికేషన్, సిగ్నలింగ్​రంగంలో వేగవంతమైన మార్పులు జరగడంలో ఇండియన్ రైల్వేస్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​సిగ్నల్​ ఇంజనీరింగ్ ​అండ్ ​టెలీ కమ్యూనికేషన్(ఇరిసెట్​) పాత్ర అసాధారణమైందని పేర్కొన్నారు. ఇరిసెట్ 65వ వార్షిక వేడుకలకు మంగ్లా చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ప్యాసిజంర్లను  గమ్యస్థానాలకు చేరవేయడంలో సిగ్నలింగ్​ వ్యవస్థ ఎంతో కీలకమైందని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన శాస్ర్త,సాంకేతిక పరిజ్ఞాన్ని ఈ వ్యవస్థ అందిస్తోందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్​కుమార్ ​జైన్ ​మాట్లాడుతూ ఇరిసెట్​సిగ్నలింగ్, కమ్యూనికేషన్ ​రంగంలో లక్ష మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. అనంతరం శిక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన 25 మంది ట్రైనీలకు అవార్డులు అందజేశారు.  కార్యక్రమంలో ఐఐఐటీ డైరెక్టర్ ​ప్రొఫెసర్​పీజే నారాయణన్, ఇరిసెట్​ డైరెక్టర్ సుధీర్​కుమార్​, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్గాన్ డొనేషన్​తో మరొకరికి లైఫ్ : గాంధీ సూపరింటెండెంట్ రాజారావు

పద్మారావునగర్, వెలుగు: ఆర్గాన్ డొనేషన్​తో మరొకరికి లైఫ్ ఇవ్వొచ్చని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. కిడ్నీ డొనేట్ చేసిన ఆరుగురిని గురువారం గాంధీ హాస్పిటల్​లోని నెఫ్రాలజీ డిపార్ట్​మెంట్​లో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. దేశంలో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని కానీ కిడ్నీ డోనర్ల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో  నిమ్స్ నెఫ్రాలజీ ప్రొఫెసర్  డాక్టర్ స్వర్ణలత, గాంధీ యూరాలజీ హెచ్ వోడీ  డాక్టర్ రవి చందర్,  గాంధీ అనస్తీసియా హెచ్ వోడీ డాక్టర్ బేబి రాణి, నెఫ్రాలజీ హెచ్ వోడీ డాక్టర్ మంజూష తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు? : మద్దూరి శివాజీ

ముషీరాబాద్, వెలుగు: నిరుద్యోగ భృతి ఇస్తామని సీఎం కేసీఆర్​హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నాయని, ఇంకెప్పుడు అమలు చేస్తారని బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరు శివాజీ ప్రశ్నించారు. గురువారం ముషీరాబాద్​లోని  తన ఆఫీసులో శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని లక్షలాది మంది యువత నిరుద్యోగ భృతి కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, వారి బాధ ప్రభు త్వానికి ఎప్పుడు తెలుస్తుందని ఆవేదన చెందారు.  నిరుద్యోగ భృతి హామీని అమలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల కొరత ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా పేద స్టూడెంట్లను విద్యకు దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేవైఎం అధికార ప్రతినిధి బుర్ర రాజ్ కుమార్, ఠాకూర్ శక్తి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్​ను రద్దు చేయాలె

వికారాబాద్/ షాద్ నగర్/ ఘట్ కేసర్, వెలుగు: ధరణితో రైతులు ఇబ్బందిపడుతున్నారని.. ఆ పోర్టల్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లాలోని తహసీల్దార్ ఆఫీసుల ఎదుటు గురువారం కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. బంట్వారం, ధారూర్​లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్  మాట్లాడుతూ.. పేదల భూములను ధరణి పేరుతో టీఆర్ఎస్ సర్కార్ గుంజుకుంటోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి జనం తగిన బుద్ధి చెప్తారన్నారు. అనంతరం బంట్వారం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,  సీనియర్ నాయకులు పాల్గొన్నారు. షాద్​నగర్​లోని మండల తహసీల్దార్ ఆఫీసు ఎదుట సెగ్మెంట్ ఇన్ చార్జి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో  నేతలు ఆందోళన చేశారు. ఘట్ కేసర్, దుండిగల్ తహసీల్దార్ ఆఫీసుల ఎదుట సైతం కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. 

పోలీస్​ ఇన్వెస్టిగేషన్​పై పుస్తకం

వెలుగు, హైదరాబాద్: ఎస్​పీఎఫ్ డీజీ ఉమేశ్​ ష్రాఫ్ రాసిన ‘ఎకనమిక్ అఫెన్సెస్- హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ పుస్తకాన్ని డీజీపీ మహేందర్​రెడ్డి ఆవిష్కరించారు. గురువారం మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్​లో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  మాజీ గవర్నర్, రిటైర్డ్ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు, రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేశ్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డితోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీ కుమార్, శివధర్ రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్ పాల్గొన్నారు.     

బోడుప్పల్​లో కార్పొరేటర్ అక్రమ వసూళ్లు.. బీజేపీ నేతల ఆరోపణ

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ లోని మొదటి డివిజన్​లో ఇల్లు కట్టుకోవాలంటే స్థానిక కార్పొరేటర్​ బింగి జంగయ్యను కలవాల్సిందేనని కార్పొరేషన్ ​బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేశ్ ఆరోపించారు. గురువారం తన ఇంట్లో మహేశ్​ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ నిధులతో కాలనీల్లో డ్రైనేజీ నిర్మిస్తూ ప్రతి ఇంటికి రూ.10 వేలు వసూలు చేశాడని ఆరోపించారు.100 గజాల ఇంటి నిర్మాణానికి రూ.10 వేలు, 200 గజాల ఇంటికి రూ.20 వేలు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. కార్పొరేషన్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్పొరేటర్ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే అనుచరులతో గూండాయిజం చేస్తున్నాడని, ఇటీవల వాటర్ వర్క్స్ అధికారుల ముందే తనపై దౌర్జన్యానికి దిగాడని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు ఏనుగుల లక్ష్మయ్య, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ వెంకటాచారి పలువురు నేతలు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్స్​పై విజిలెన్స్ రిపోర్టును బయటపెట్టాలె

హైదరాబాద్,వెలుగు: తెలంగాణ మోడల్ స్కూల్స్​డైరెక్టరేట్​లో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఎం. శ్రీనివాస్​ డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేసి  ఇచ్చిన విజిలెన్స్  రిపోర్టును బయటపెట్టాలని కోరారు. ఈ మేరకు  విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణకు  గురువారం ఆయన లెటర్ రాశారు. పీఆర్సీ సందర్భంగా మోడల్ స్కూల్ టీచర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా  సూపరింటెండెంట్ కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసినట్టు టీచర్లు చెప్తున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనిపై విజిలెన్స్ కమిటీ విచారణ చేసి, అవినీతి నిజమేనని చెప్పినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని లెటర్​లో పేర్కొన్నారు.