డ్రగ్స్ రాకెట్‌‌ ను ఛేదించిన ఈగల్ ఫోర్స్..రహస్య డ్రగ్ తయారీ కేంద్రంపై దాడి..రూ.కోటి విలువైన డ్రగ్స్

డ్రగ్స్ రాకెట్‌‌ ను ఛేదించిన ఈగల్  ఫోర్స్..రహస్య డ్రగ్  తయారీ కేంద్రంపై దాడి..రూ.కోటి విలువైన డ్రగ్స్
  • 750 గ్రాముల మెఫెడ్రోన్  స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

ఎల్బీనగర్, వెలుగు: ఈగల్  ఫోర్స్  మరో భారీ డ్రగ్స్ రాకెట్‌‌ను ఛేదించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలంలో రహస్యంగా నిర్వహిస్తున్న మెఫెడ్రోన్  డ్రగ్  తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి 750 గ్రాముల మెఫెడ్రోన్(ఎండీ) డ్రగ్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్  చేసిన అధికారులు, డ్రగ్  తయారీకి ఉపయోగిస్తున్న రసాయనాలు, యంత్రాలు, పరికరాలు, ఒక కారు, మూడు మొబైల్  ఫోన్లను సీజ్ చేశారు. 

డ్రగ్స్​తో పాటు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ. కోటి ఉంటుందని ఈగల్​ ఫోర్స్  అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన కీసరి మత్స్యగిరి అలియాస్  నరేశ్, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌‌కు చెందిన నిమ్మల నరేశ్​ను అరెస్ట్  చేసినట్లు చెప్పారు. అబ్దుల్లాపూర్ మెట్  శివారులోని ఓ మామిడి తోటలోని షెడ్‌‌లో ‘ఫేషియల్  గ్లో పౌడర్’ తయారు చేస్తున్నట్లు చూపిస్తూ, మెఫెడ్రోన్  డ్రగ్  తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 

కీసరి మత్స్యగిరికి దేశవ్యాప్తంగా డ్రగ్  తయారీ కేసులతో పాటు దోపిడీ, హత్య వంటి నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. 2015లో ఓ కెమికల్  కంపెనీలో కెమిస్ట్‌‌గా పని చేసిన అతను డ్రగ్  తయారీ గురించి నేర్చుకొని, అంతర్రాష్ట్ర డ్రగ్  ముఠాలో సభ్యుడిగా చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన వారు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్  చేస్తామని చెప్పారు.