టూరిస్టుల హబ్ హైదరాబాద్ నగరానికి పోటెత్తుతున్న దేశ, విదేశీ సందర్శకులు

టూరిస్టుల హబ్ హైదరాబాద్ నగరానికి పోటెత్తుతున్న  దేశ, విదేశీ సందర్శకులు
  •     గతేడాది రికార్డు స్థాయిలో 8.5 కోట్ల మంది రాక
  •     మిస్ వరల్డ్ కాంటెస్ట్​, ‘మెస్సీ’ రాకతో అంతర్జాతీయంగా పేరు  
  •     ఇటీవల ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: చారిత్రక కట్టడాల వైభవం, బిర్యానీ, ఇరానీ చాయ్​కీర్తి, ఆధునిక ఐటీ హబ్ మేళవింపుతో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ పర్యాటకుల రాకతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. దేశ, విదేశాల నుంచి నగరానికి తరలివస్తున్న పర్యాటకుల సంఖ్య ఏటికేడూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నది.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సరికొత్త పర్యాటక పాలసీ(2025–30) ఊపుతో 2025–-26 సంవత్సరంలో రికార్డు స్థాయిలో సుమారు 8.5 కోట్ల మందికి పైగా దేశీయ పర్యాటకులు, 3.5 లక్షల మంది విదేశీ టూరిస్టులు భాగ్యనగర సౌందర్యాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. 2023లో దేశీయ పర్యాటకుల సంఖ్య 5.84 కోట్లు కాగా, 2024లో ఏకంగా 8.40 కోట్లకు చేరింది. 2025లో 8.53 కోట్లకు పెరగ్గా.. విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 2024తో పోలిస్తే 2025లో 10 శాతానికి పైగా పెరిగినట్లు టూరిజం శాఖ తెలిపింది. ఇదే ఉత్సాహంతో రాబోయే 2026-–27 సంవత్సరంలో 9.5 కోట్ల మందికి పైగా స్వదేశీ, 4 లక్షలకు పైగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా టూరిజం శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది.

అందాల పోటీలు.. మెస్సీ టూర్​తో..

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మారుమోగడానికి రెండు ప్రధాన ప్రపంచ ఈవెంట్లు కారణమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధ మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే మే 31న హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. వందకు పైగా దేశాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో నగరం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఫుట్‌‌‌‌బాల్ దిగ్గజం మెస్సీ 2025 డిసెంబర్13న హైదరాబాద్‌‌‌‌కు రావడంతో నగరం పేరు అందరి నోళ్లలోనూ నానింది. మెస్సీ రాకతో అంతర్జాతీయ మీడియా, ప్రముఖ న్యూస్ ఛానళ్లు, యూట్యూబర్లు హైదరాబాద్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌‌‌‌బాల్ అభిమానులు హైదరాబాద్ నగర వైభవం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.

నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు..

కేవలం చారిత్రక ప్రదేశాలే కాకుండా, ఇక్కడి అద్భుతమైన ఆహార సంస్కృతి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మెట్రో నగరాల పోటీని తట్టుకుని హైదరాబాద్ నేషనల్ కలినరీ డెస్టినేషన్ 2026(ఉత్తమ ఆహార పర్యాటక నగరం) అవార్డును కైవసం చేసుకుంది. గోవా వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నేతృత్వంలో, గోవా పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహించిన నేషనల్ టూరిజం కాన్‌‌‌‌క్లేవ్ అండ్ అవార్డ్స్ ప్రత్యేక సదస్సులో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు.  

ఆకట్టుకునే నైట్​ బజార్లు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ పర్యాటక పాలసీ(2025–30) టూరిజం రంగానికి కొత్త ఊపిరి పోస్తోంది. ప్రపంచస్థాయి వసతులు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, టూరిస్ట్ స్పాట్ల వద్ద ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన రవాణా సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం అడ్వాంటేజ్​గా మారింది. నైట్ లైఫ్ , ఫుడ్ స్ట్రీట్స్, రాత్రి కూడా నగర ఆహారాన్ని ఆస్వాదించేలా  నైట్ బజార్లను ప్రోత్సహించడం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఐటీ ప్రొఫెషనల్స్ అంతర్జాతీయ సదస్సులు, క్రీడా ఈవెంట్ల కోసం నగరానికి రావడం పెరిగింది. బిజినెస్ పనిమీద వచ్చేవారు సైతం ఇక్కడి రుచులను ఆస్వాదించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కట్టి పడేస్తున్న వంటకాలు..

హైదరాబాద్ వచ్చే ఏ పర్యాటకుడైనా ఇక్కడి వందల ఏండ్ల నాటి షాహీ రుచులకు ఫిదా కావాల్సిందే.  ముఖ్యంగా సిటీ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ టేస్ట్​చూడకుండా ఎవరూ తిరిగి వెళ్లడం లేదు. వీటితో పాటు రంజాన్ మాసంలో లభించే హలీమ్​వంటకం, ఇంకా కబాబ్స్, రాతి బండలపై నెయ్యి వేసి ప్రత్యేకంగా కాల్చే పత్తర్ కా ఘోష్ రుచి కూడా మరువలేనిదని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ఘాటైన మటన్ సూప్, డబుల్ కా మీఠా, ఖుబానీ కా మీఠా, ఫిర్నీని కూడా టేస్ట్​చేసి వహ్వా అంటున్నారు.