- కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్
- గ్రామాల్లో 416 ట్రిప్పుల ఇసుక డంపులు స్వాధీనం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, డంపులను అరికట్టేందుకు సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ నజర్ పెట్టింది. ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లావ్యాప్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేస్తున్నారు. కొత్తపల్లి, జమ్మికుంట, మానకొండూరు, వీణవంక మండలాల్లోని గ్రామాల్లో దాడులు నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 416 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు. నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. వరుస దాడులతో ఇసుక అక్రమ నిల్వదారులు, రవాణాదారులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు.
వానాకాలం ముందు ఇసుక నిల్వలు..
వానాకాలం ప్రారంభం కావడంతో త్వరలో వర్షాలు కురిస్తే వాగుల్లో నీళ్లు చేరే అవకాశం ఉండడంతో ఇసుక అక్రమ రవాణాదారులు మానేరు, మోతె వాగుల్లో ముందస్తుగా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. వాగు సమీప గ్రామాల్లోని పొలాలు, తోటలు, ఇళ్ల మధ్య ట్రిప్పుల కొద్ది డంప్ చేస్తున్నారు. ఈ ఇసుకను రాత్రిళ్లు లారీల్లో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో స్థానిక పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వారం రోజులుగా కొత్తపల్లి, జమ్మికుంట, మానకొండూరు, వీణవంక మండలాల్లో దాడులు నిర్వహించి ఇసుకను సీజ్ చేస్తున్నారు.
ఇటీవల పట్టుబడిన ఇసుక డంపులు ఇవే..
- కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు భారీ ఇసుక డంపులను(50 ట్రిప్పులు), నాగుల మల్యాల పరిధిలో ఒక డంపు(30 ట్రిప్పులు)ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం గుర్తించి, సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ మూడు డంపుల్లో మొత్తం 80 ట్రాక్టర్ల లోడుల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను చట్టపరమైన చర్యల కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
- మానకొండూరు మండలం వెల్ది గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 భారీ ఇసుక డంపులను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం గుర్తించి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఇసుక డంపుల్లో సుమారు 56ట్రిప్పుల ఇసుకను అధికారులు గుర్తించారు.
- టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు కొత్తపల్లి మండలం రాములపల్లి గ్రామంలో ఈ నెల 16న పెద్ద ఇసుక డంప్‌ను గుర్తించి, అందులోని సుమారు 50కు పైగా ట్రాక్టర్ల లోడ్ల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలం శాంతినగర్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ & జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో గల లంబాడి రవి అనే వ్యక్తికి చెందిన కాంపౌండ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన మరో భారీ ఇసుక డంప్‌ను గుర్తించి, సుమారు 30కు పైగా ట్రాక్టర్ల లోడుల ఇసుకను సీజ్ చేశారు.
- జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 15న దాడులు చేసి మూడు భారీ డంప్‌లను సీజ్ చేశారు. ఇందులో ఒక డంపులో 100 ట్రాక్టర్ల లోడుల ఇసుక, మరో రెండు డంప్‌ల్లో మరో 50 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను సీజ్ చేశారు. రవాణాకు ఉపయోగిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాను సహించం
ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
-గౌష్ ఆలం, కరీంనగర్ సీపీ
