
హైదరాబాద్ సిటీ, వెలుగు: కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీపీ ఆఫీస్ లో బుధవారం సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కోర్ట్ జరిగింది. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లలో రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు ఈ కోర్టు నిర్వహించారు.
10 పోలీసు స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ఆధారంగా రౌడీ షీటర్లను, గ్యాంగ్స్‌ను పిలిపించారు. సుమారు 11 గ్యాంగ్‌లలోని 101 సభ్యులు పరస్పర దాడులు, హత్యలు, హత్యాయత్నాల వంటి నేరాలకు పాల్పడినవారు ఉన్నారు. ఈ కోర్టు విచారణలో 6 గ్యాంగ్‌లకు కుటుంబ సభ్యుల సమక్షంలో సీపీ రాజీ కుదుర్చారు. మిగిలిన గ్యాంగ్‌లు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. నగర శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ కోర్టులో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.ఆపూర్వారావు, 10 పోలీసు స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.