సిటీ జనం సక్కగ నిద్రపోతలె !

సిటీ జనం సక్కగ నిద్రపోతలె !
  • అర్ధరాత్రి దాటినా మేల్కొనే ఉంటున్న సిటిజన్లు
  •     లేట్​నైట్​వరకు ఆఫీస్​వర్క్​, ఫోన్లు చూడడం 
  •     గతేడాదికంటే 32శాతం పెరిగిన బాధితులు
  •     గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌‌ ‌‌కార్డ్ –2022 సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘ఎర్లీ టు బెడ్​– ఎర్లీ టు రైజ్​’ అన్న స్లీపింగ్​ఫార్ములాను నగరవాసులు మర్చిపోతున్నారు. కొంతమంది ఆఫీస్ పనుల కారణంగా ఆలస్యంగా నిద్రపోతుంటే..  మరికొంతమంది భవిష్యత్ పై బెంగతో నిద్రపట్టడంలేదని అంటున్నారు.  ఇంకొందరు సోషల్ మీడియా ఉంటుండగా నిద్రపోవడం లేదని చెబుతున్నారు. జనాల్లో నిద్ర అలవాట్లపై  ‘వేక్ ఫిట్’ సంస్థ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మెట్రో నగరాల్లో ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 ’సర్వే రిపోర్ట్ ని ఇటీవల రిలీజ్​ చేసింది. ఇందులో ఫోను వాడుతూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్న వాళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా 57శాతం పెరిగిందని పేర్కొంది. కాగా, హైదరాబాదీల్లో గతేడాదితో పోలిస్తే పడుకునే ముందు ఫోన్ వాడే వారి సంఖ్య తగ్గినప్పటికి, నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య 32 శాతం పెరిగినట్లు తెలిపింది. అయితే రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయినా..   ఎక్కువ ఫోన్ వాడినా హెల్త్​ ఇష్యూలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఈ అలవాట్లతో  నిద్రలేమి సమస్యతోపాటు భవిష్యత్ లో మరిన్ని వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.  

పాండమిక్​ నుంచి.. 

ప్రతి పదిమంది హైదరాబాదీల్లో నలుగురు రాత్రిళ్లు సోషల్ మీడియా వాడుతూ.. నిద్రకు దూరమవుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో  దాదాపు 14 ప్రశ్నలు అడిగారు.  బెడ్  టైం, వేకప్​ టైం,  నిద్రలేచినా బెడ్​సర్దుతారా?  లేవగానే ఎలా ఫీలవుతారు? పాండమిక్​నుంచి  స్లీపింగ్​టైంలో మార్పులేమైనా వచ్చాయా?  నిద్రకు  ముందు ఫోన్ చూస్తారా ? మీకు నిద్రలేమి ఉందని అనుకుంటున్నారా? ఇలాంటి పలు ప్రశ్నలను సర్వేలో అడిగారు. 

ఆలస్యంగా నిద్రపోతే అనారోగ్యాలే..

‘రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటే వివిధ రకాల అనారోగ్యాల  పడే ప్రమాదం ఉంది.  లేట్ నైట్ ఫోన్లు వాడకం, సోషల్ మీడియా ఎక్కువ వాడటం  వల్ల కంటి సంబంధిత సమస్యల్లో చిక్కుకుంటారు.  దీంతో పాటు  నిద్రలేమి (ఇన్​సోమ్నియా), హార్ట్ బీట్ లో ఇబ్బందులు, హార్మోనల్ ఇంబాలెన్స్,  బరువుపెరగడం,  ఉదయం నిద్రపోయే అలవాటు పెరగడం, భవిష్యత్ లో కార్డియో సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి  సమస్యలు వస్తాయి.  ఆడవారిలో సంతాన లేమి సమస్యలు, పీరియడ్ సైకిల్ సక్రమంగా రాకపోవడం వంటివి కూడా వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ సరైన నిద్ర అవసరం’ అని డాక్టర్లు అంటున్నారు. 

ఆడవారిలోనే అధికంగా.. 

సిటీలో నిర్వహించిన సర్వేలో నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య 32శాతం పెరిగినట్లు  తేలింది.  వీరిలో 28శాతం మంది కరోనా తర్వాత తమ భవిష్యత్ ఎలా ఉంటుందనే భయంతో రాత్రిళ్లు మెలకువగా ఉంటున్నట్టు తెలిపారు.  మగవారితో పోలిస్తే ఆడవారిలోనే అధికంగా నిద్రలేమి భయాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు పనివేళల్లో నిద్రమత్తుతో బాధపడుతున్న వారి సంఖ్య గతేడాది 20శాతం ఉంటే, ప్రస్తుతం అది 49శాతానికి పెరిగింది. వీరిలో 53శాతం ఐటీ సెక్టార్ కు చెందినవారే ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగినప్పటికీ, పడుకునే ముందు ఫోన్లు చూస్తున్నవారు 87 శాతం మంది ఉన్నారు. కిందటేడాది ఆ సంఖ్య 94శాతం ఉండేది.