సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దాదాపు మూడు నెలల ముందే జర్నీ కష్టాలు మొదలయ్యాయి. ఏ రైలులో చూసినా ఒక్క సీటు రిజర్వేషన్ ఖాళీగా లేదు. IRCTCలో సంక్రాంతి రైళ్లకు బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే టికెట్లు ఆల్ మోస్ట్ బుక్ అయిపోయాయి. ఏపీ వైపు వెళ్లే రైళ్లల్లో సీట్లన్నీ ఫుల్గా నిండిపోయాయి. ఒక్కో రైలులో వందల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడిపితే తప్ప సొంతూరిలో పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్యాసింజర్ల రద్దీని బట్టి స్పెషల్ ట్రైన్స్నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
ప్రతీ సంవత్సరం.. సంక్రాంతి సెలవులు జనవరి రెండో వారం నుంచి మొదలవుతుండగా ఏపీకి వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్బుకింగ్ చేసుకోవడంతో రైళ్లలో సీట్లన్నీ ఫుల్‌అయ్యాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లలో టికెట్లు చాలా వరకూ బుక్ అయిపోయాయి. ఏపీకి వెళ్లే గోదావరి, విశాఖ.. వంటి రెగ్యులర్ రైళ్లు ఫుల్గా బుక్ అయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి వైజాగ్, కాకినాడ, నర్సాపూర్, తెనాలి వైపు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ బుకింగ్స్ కావడం కొసమెరుపు. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల వైపు వెళ్లే రైళ్లలో టికెట్ల కోసం చూస్తున్న వాళ్లకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్లే రైళ్లలో కూడా బెర్త్లు ఖాళీగా లేవు.
గుంటూరు, విజయవాడ లోపు మాత్రమే రైళ్లలో కాస్తోకూస్తో అడ్వాన్స్ బుకింగ్కు అవకాశం ఉంది. సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్గా రిజర్వ్ కావడంతో ఇప్పుడు ప్యాసింజర్లు స్పెషల్ రైళ్ల కోసం వెయిట్‌చేస్తున్నారు. స్పెషల్ రైళ్లు నడిపితే సీట్రిజర్వేషన్ చేసుకునేందుకు చూస్తున్నామంటున్నారు. ప్రతిసారి సంక్రాంతికి రైల్వే శాఖ ఏపీకి స్పెషల్ రైళ్లను నడుపుతుంది.
