
హైదరాబాద్, వెలుగు: ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగింపునకు ఆదేశాల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో గర్భం తొలగిస్తే తల్లితో పాటు గర్భంలోని శిశువుకు ప్రాణాపాయమని మెడికల్ బోర్డు రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. పెండ్లి కాని తన కుమార్తె గర్భం తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన ఓ తల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారించారు.
‘‘28 వారాల గర్భాన్ని తొలగిస్తే ఆమె ప్రాణాలకు ముప్పని మెడికల్ రిపోర్టులు సూచిస్తున్నాయి. బాలిక ప్రసవం వరకు నీలోఫర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయొద్దు. వైద్య సేవలు అందించాలి. నిత్యం పర్యవేక్షణలో ఉంచాలి. మహిళా, శిశు సంక్షేమ, పోలీసు శాఖల సమన్వయంతో సఖి కేంద్రం సహాయం పొందాలి’’ అని ఉత్తర్వులిచ్చారు. బాలిక ఆరోగ్య భద్రతకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నీలోఫర్ ఆస్పత్రిని ఆదేశించారు. విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.