పొద్దున పాతబస్తీ.. మధ్యాహ్నం మైలాదేవ్​పల్లి.. సాయంత్రం చర్లపల్లి..హడలెత్తిన హైదరాబాద్

పొద్దున పాతబస్తీ.. మధ్యాహ్నం మైలాదేవ్​పల్లి.. సాయంత్రం చర్లపల్లి..హడలెత్తిన హైదరాబాద్
  • 17 మంది సజీవదహనంతో చార్మినార్​లో విషాదఛాయలు
  • భయంతో వణికిపోయిన స్థానికులు
  •  రాజేంద్రనగర్​లో మరో ప్రమాదం.. 53 మంది సేఫ్
  • చర్లపల్లిలో పేలిన ఫ్యుయెల్​ట్యాంకర్ ​బ్యాటరీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం 

హైదరాబాద్​సిటీ/శంషాబాద్/ గండిపేట/మేడిపల్లి/పద్మారావునగర్​, వెలుగు: గ్రేటర్ ​హైదరాబాద్​ను ఆదివారం అగ్నిప్రమాదాలు హడలెత్తించాయి. పొద్దుపొద్దున్నే సిటీ నడిబొడ్డున ఉన్న చార్మినార్ ​గుల్జార్ ​హౌజ్​లో జరిగిన అగ్ని ప్రమాదంతో జనం ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 17 మంది సజీవదహనమయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన లీడర్లు, అధికారులపై మృతుల కుటుంబీకులు సీరియస్​అయ్యారు. ఎంపీ అనిల్​కుమార్, మేయర్​ విజయలక్ష్మిని అడ్డుకొని నిలదీశారు.

అంబులెన్స్ ​లేటుగా వచ్చిందని అందుకే ప్రాణాలు దక్కలేదని ఆవేదన చెందారు. దీంతో అక్కడే ఉన్నతాధికారులు వారిని సముదాయించారు. మంత్రులతోపాటు డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, హైడ్రా చీఫ్​ రంగనాథ్, డీసీపీ స్నేహా మెహరా, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కాంగ్రెస్ ​నేత షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు జుల్ఫీకర్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,  ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అక్కడికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.

గుల్జార్​హౌస్​ ఘటనలో చనిపోయిన సనత్ నగర్ సౌభాగ్యనగర్ కు చెందిన రజని అగర్వాల్​ అంత్యక్రియలను ఈఎస్ఐ శ్మశానవాటికలో నిర్వహించారు.  సనత్​నగర్​ కాంగ్రెస్​ ఇన్​చార్జ్ ​డా.కోట నీలిమ పాల్గొన్నారు. కాగా, గుల్జార్​హౌస్​ వద్ద మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు పూర్తిచేస్తున్న టైంలో రాజేంద్రనగర్ ​మైలార్​దేవ్​పల్లిలోని అపార్ట్​మెంట్​లో మరో ఫైర్​యాక్సిడెంట్​జరిగింది. అక్కడి ఉడంగడ్డ మొఘల్స్ కాలనీలోని జీ+ త్రీ బిల్డింగ్​సెకండ్​ ​ఫ్లోర్​లో మంటలు చెరలేగడంతో అందులోని జనం భయంతో టెర్రస్​మీదకు పరుగులు తీశారు. కాపాడండి.. కాపాడండి.. అంటూ పెద్దగా కేకలు వేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. టెర్రస్​పై ఉన్న 53 మందిని(8 కుటుంబాలు) సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. 

మైలార్​దేవ్​పల్లిలో గంటన్నరపాటు భయం భయం

మైలార్​దేవ్​పల్లి ఉడంగడ్డ మొఘల్స్ కాలనీలోని జీ+త్రీ బిల్డింగ్​లో మొత్తం 12 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆదివారం సెకండ్  ​ఫ్లోర్ ​మెట్ల మార్గంలోని కరెంట్​​బోర్డులో షార్ట్ ​సర్క్యూట్​జరిగి మంటలు చెలరేగాయి. క్రమంగా చుట్టుపక్కలకు వ్యాపించడంతో రెండు, మూడు అంతస్తుల్లోని జనమంతా టెర్రస్​ మీదకు పరుగులు తీశారు. కిందకు వెళ్లే మెట్ల మార్గంలో మంటలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంతా టెర్రస్​పైకి వెళ్లారు.

ఫస్ట్​ ఫ్లోర్ లోని వారంతా భయంతో కిందకు పరుగులు తీశారు. బండ్లగూడ ఫైర్ స్టేషన్ నుంచి మూడు ఫైరింజిన్లతో అక్కడి చేరుకున్న ఫైర్​సిబ్బంది గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. టెర్రస్​పై ఉన్న 53 మందిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. వీరిలో 20 మంది చిన్నారులు, 33 మంది మహిళలు ఉన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రూ.కోటి ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. 

అంటుకుని ఉంటే.. ఊహకందని ప్రమాదం

మేడ్చల్ ​జిల్లా చర్లపల్లి ఇండస్ట్రియల్​ ఏరియాలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం అక్కడి ఐఓసీ(ఇండియన్​ఆయిల్​కార్పొరేషన్) ముందుగా వెళ్తున్న ఖాళీ పెట్రోల్​ట్యాంకర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ట్యాంకర్​కు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ పక్కకు తీసి ఆపాడు. ఆ పక్కనే ఉన్న నిండు పెట్రోల్​ ట్యాంకర్​కు, మరో గ్యాస్ ​సిలిండర్ల లారీకి మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమయానికి ఫైర్​ఇంజిన్లు రాకపోయి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు, ట్యాంకర్లు, లారీల డ్రైవర్లు తెలిపారు. బీపీసీఎల్, ఐఓసీ, భారత్ గ్యాస్ డిపోలకు మంటలు వ్యాపిస్తే చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.