- ఫేస్బుక్ యాడ్‌తో మొదలైన స్కామ్
బషీర్‌బాగ్, వెలుగు: కేరళ లాటరీ, ఆన్లైన్ గేమింగ్ పేరిట సైబర్ చీటర్స్ ఓ బాధితుడిని మోసం చేశారు. హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన 43 ఏండ్ల బాధితుడు తన మొబైల్లో ఫేస్బుక్ చూస్తుండగా లాటరీ, గేమింగ్‌కు సంబంధించిన ఒక యాడ్ కనిపించింది. దానిని క్లిక్ చేయగానే వాట్సాప్‌కు స్కామర్స్ ఓ లింక్ పంపారు.
ఆ లింక్ ఓపెన్ చేయగా మెగా కేరళ లాటరీ అనే గేమింగ్ యాప్ డౌన్లోడ్ అయింది. అది నిజమైన లాటరీ యాప్ అనుకున్న బాధితుడు ఆన్లైన్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అలాగే అందులోని గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు రావడంతో నమ్మకం పెరిగి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేశాడు.
అందుకోసం తన క్రెడిట్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు. అయితే బాధితుడి అకౌంట్ ఫ్రీజ్ అయిందని, లాభాలు ఒకేసారి బదిలీ చేస్తామని నమ్మించారు. అనంతరం అతని కాంటాక్ట్స్ బ్లాక్ చేశారు. దీంతో మొత్తం రూ.7,73,839 మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు సోమవారం ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.
ఎన్నారై ఖాతా నుంచి రూ.2 లక్షలు మాయం
జూబ్లీహిల్స్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివసిస్తున్న ఓ ఎన్ఆర్ఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఎన్ఆర్ఐ ఖాతా ఉన్న డాక్టర్ వినయ్ షీల్ బన్సల్ (70) మొబైల్‌కు ఈ నెల 18న కొన్ని ఓటీపీలు వచ్చాయి. వాటిని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సైబర్ ఫ్రాడ్ జరిగినట్లు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
