
- సిటీవాసుల నిరసనలతో కాస్త తగ్గిన మెట్రో
- రేట్లనే సవరించాలని ప్రయాణికుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సిటీలో మెట్రోచార్జీల పెంపుపై ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్ కాస్త వెనక్కి తగ్గింది. పెంచిన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈనెల 24వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే మెట్రో ధరలను పెంచినట్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
పది శాతం డిస్కౌంట్ ఇలా..
ఇటీవల మెట్రో పెంచిన రేట్ల ప్రకారం 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.50 చార్జ్ చేస్తుంది. ఈనెల 24 నుంచి దీనిపై 10 శాతం డిస్కౌంట్ఇస్తూ రూ.45 తీసుకోనుంది. ఇలా ప్రతి టికెట్ చార్జ్ పై 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.
రేట్లను సవరించకుండా... డిస్కౌంట్లా.!?
ప్రయాణికులపై అధిక భారం పడొద్దనే 10 శాతం డిస్కౌంట్ నిర్ణయం తీసుకున్నామని మెట్రో ప్రకటించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డిస్కౌంట్ కాకుండా రేట్లనే సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిస్కౌంట్లను ఏ క్షణమైనా ఎత్తేసే అవకాశం ఉందని, రేట్లను సవరించాల్సిందేనంటున్నారు. అవసరమైతే పాత రేట్లనే అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు. అయితే, మెట్రో ఆపరేషన్ నిరంతరం కొనసాగించడానికే ధరలను సవరించాల్సి వచ్చిందని, అయినా ప్రయాణికులపై భారం పడకూడదని 10 శాతం డిస్కౌంట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని - మెట్రో ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.