నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ మెట్రో విస్తరణ.. టెండర్లకు ఆహ్వానం

నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ మెట్రో విస్తరణ.. టెండర్లకు ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన ఫేజ్-III మెట్రో రైల్ విస్తరణకు కసరత్తులు మొదలయ్యాయి. మెట్రో రైలు మూడో దశ ప్రతిపాదిత ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికలు(పీపీఆర్) మరియు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లు తయారు చేసేందుకు కన్సల్టెంట్ల ఎంపికకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఎల్) టెండర్లను ఆహ్వానించింది.

హెచ్‌ఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ 278 కి.మీ (ఓఆర్‌ఆర్‌లో 8 ఎక్స్‌టెన్షన్ కారిడార్లు మరియు 4 కారిడార్లు) మొత్తం 12 కారిడార్లను 4 ప్యాకేజీలుగా విభజించామని, ఒక్కోదానికి రెండు ప్యాకేజీలకు మించరాదని చెప్పారు. అర్హత, ఆసక్తి కలిగిన కన్సల్టెంట్ల సంస్థలు వ్యక్తీకరణ(ఆర్ఎఫ్‌సీ) టెండర్లను ఆగస్టు 28లోగా సమర్పించాలని ఆయన కోరారు. అందుకు సంబంధించిన ఆర్ఎఫ్‌పీ డాక్యుమెంట్లను ఇప్పటికే హెచ్ఎంఆర్ఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు  ఆయన తెలిపారు.

టెండర్ల సమర్పణకు ఆగస్టు 28 చివరి తేదీ కాగా, షార్ట్‌లిస్ట్ చేయబడిన సంస్థలను ఆగస్టు 30న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ టెండర్లు పొందిన సదరు కన్సల్టెంట్లు.. మూడు నెలల్లో మెట్రో రైలు సివిల్ నిర్మాణాలు, స్టేషన్ మరియు డిపో ప్లానింగ్, మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్ మరియు రైలు కమ్యూనికేషన్, రైలు ఆపరేషన్ ప్రణాళికలు, కోచ్‌లు, వ్యయ అంచనాలు, ఛార్జీల నిర్మాణంపై వివరాలను అందజేయనున్నట్లు సమాచారం.

పీపీఆర్, డీపీఆర్ రూపకల్పన కోసం.. నాలుగు ప్యాకేజీలు

  • హెచ్‌ఏఎంఎల్ జారీ చేసిన టెండర్ల ప్రకారం మొదటి ప్యాకేజీలో పటాన్‌ చెరువు-ఇస్నాపూర్(13 కి.మీ), ఎల్బీనగర్-పెద్ద అంబర్‌పేట(13 కి.మీ), ఓఆర్ఆర్ పటాన్ చెరువు - కోకాపేట, నార్సింగి ఇంటర్‌ఛేంజ్ వరకు నిర్ణయించారు.
  • ఇక రెండో ప్యాకేజీలో శంషాబాద్ జంక్షన్ - షాద్‌నగర్ వరకు (28 కి.మీ), శంషాబాద్ విమానాశ్రయం - తుక్కుగూడ - ఫార్మాసిటీ(26 కి.మీ), ఓఆర్ఆర్ శంషాబాద్-బొంగ్లూరు-పెద్ద అంబర్‌పేట వరకు (40 కి.మీ) చేర్చారు.
  • ఇక మూడో ప్యాకేజీలో ఉప్పల్-బీబీనగర్ (25 కి.మీ), తార్నాక-ఈసీఐఎల్ (8 కి.మీ), ఓఆర్ఓఆర్ పెద్ద అంబర్‌పేట-ఘట్‌కేసర్-శామీర్‌పేట-మేడ్చల్ వరకు (45 కి.మీ) చేర్చారు.
  • ఇక చివరిగా నాలుగో ప్యాకేజీలో జీబీఎస్ మెట్రో-తూంకుంట వరకు 17 కి.మీ దూరంలో ఉన్న డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ప్యారడైజ్-కండ్లకోయ (12 కి.మీ), ఓఆర్ఆర్ మేడ్చల్ - పటాన్‌చెరువు (29 కి.మీ.) చేర్చారు.