న్యూ ఇయర్ రోజు మెట్రో నయా రికార్డ్

న్యూ ఇయర్ రోజు మెట్రో నయా రికార్డ్

4.60 లక్షల ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌ జర్నీ
31న కిటకిటలాడిన ట్రైన్స్‌‌‌‌‌‌‌‌10

కొత్త ఏడాదికి మెట్రో సరికొత్త రికార్డుతో వెల్ కమ్ చెప్పింది. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు 4.60లక్షల మంది ట్రైన్ జర్నీ చేశారు. ఇప్పటివరకు ఇదే రికార్డ్. సెలబ్రేషన్స్​ నేపథ్యంలో ట్రైన్స్​ టైమింగ్ పెంచడం, మద్యం లిమిట్‌గా తాగిన వాళ్లకూ అనుమతి ఇవ్వడం మెట్రోకు కలిసొచ్చింది.

హైదరాబాద్‌ , వెలుగు: కొత్త ఏడాదికి హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డుతో స్వాగతం పలికింది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పొడిగించిన టైమింగ్స్‌తో ఒక్క రోజులో 4.60 లక్షల మంది మెట్రోజర్నీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రోకు ఇది మరో మైలురాయి. గతంలో 4.10 లక్షల నుంచి 4.20 లక్షల మంది వరకు గరిష్ఠంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం రాత్రి రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. లిమిటెడ్‌‌గా మద్యం తాగిన వారిని ప్రయాణించేందుకు కూడా అనుమతించడంతో నగరవాసులు ఎక్కువగా మెట్రో ఎక్కేందుకు మొగ్గు చూపారు. ఈసారి మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2,104 డ్రంకన్‌‌ డ్రైవ్‌ కేసులు మాత్రమే నమోదుకావడం గమనార్హం. ఫుల్‌‌గా ఎంజాయ్‌ చేశాక సొంత వాహనాలు డ్రైవ్‌ చేసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు. కార్లు, బైకులను ఆయా హోటళ్లు, ఈవెంట్స్ ఏరియాలు, ఆఫీసుల వద్దే వదిలేసి మెట్రోలో ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. న్యూఇయర్​ జోష్‌లో ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని కొందరు, పోలీసులకు చిక్కి కొత్త ఏడాదిని చికాకుతో ప్రారంభించడం ఎందుకని మరికొందరు మెట్రోకే జై కొట్టారు.

2 గంటలు.. 40 వేల మంది
న్యూఇయర్​వేడుకల సందర్భంగా ఏటా నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం ఏర్పడేది. అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం, డ్రంకెన్‌‌ డ్రైవ్‌ టెస్టులతో ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలు చోటుచేసుకునేవి. పోలీసులకు కూడా చాలా భారంగా ఉండేది. ఈసారి అలాంటి ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. ప్రధానంగా మెట్రో సేవలను రెండు గంటల పాటు పొడగించడంతో 40 వేల మంది అదనంగా ప్రయాణించారు. తాగిన వారిని కూడా అనుమతించడంతో జనం ఎక్కువగా మెట్రో ఎక్కేందుకే మొగ్గు చూపినట్టు మెట్రో అధికారులు చెప్పారు . వన్ డేలో 4,60,483 మంది మెట్రోను వినియోగించుకున్నారు. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ రూట్‌‌లో 2,68, 900 మంది, నాగోలు నుంచి రాయదుర్గ్‌‌ లైన్‌‌లో 1,91,583 మంది ప్రయాణించినట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ప్రకటించారు.

అమీర్ పేటలో అధికం
అమీర్‌ పేట స్టేషన్లో 28,696 ఎంట్రీలు, 25,548 ఎగ్జిట్‌‌లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఎల్బీనగర్‌ నిలిచింది. ఈ స్టేషన్‌‌లో 25,121 ఎంట్రీలు, 22,898 మంది ప్రయాణికులు ఎగ్జిట్‌ అయినట్టు మెట్రో అధికారులు తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన రాయదుర్గ్‌ స్టేషన్‌‌లో 21,336 మంది ఎక్కగా, 16,154 మంది దిగారు. కేపీహెచ్‌బీలో మెట్రోస్టేషన్లో 18,697 ఎంట్రీలు, 17,965 ఎగ్జిట్లు నమోదైనట్లు తెలిపారు.