హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాక మెట్రో.. ఏ టైం వరకంటే..

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాక మెట్రో.. ఏ టైం వరకంటే..

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా సిటీ జనానికి మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో టైమింగ్స్​పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రయాణికుల సౌకర్యం కోసం డిసెంబర్ 31న రాత్రి మెట్రో టైమింగ్స్ పొడిగించారు. ఇయ్యాల అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అన్ని టెర్మినల్ స్టేషన్స్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి ట్రైన్ బయలుదేరనుంది.

హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన ప్రయాణికులు సేఫ్గా ఇంటికి చేరుకునేందుకు పనివేళలను పొడిగించనున్నట్లు మెట్రో సంస్థ తెలిపింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సిటీలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనేందుకు మెట్రో బెటర్ ఆప్షన్ అని పేర్కొంది.

ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఇలా..
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని, న్యూఇయర్ వేడుకలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 31న  రాత్రి 11 గంటల నుంచి జనవరి1 ఉదయం 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్​లలో అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ అనుమతి ఉండదన్నారు. 

హుస్సేన్ సాగర్ చుట్టూ వివిధ జంక్షన్ల వద్ద అవసరాల ఆధారంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని, ఖైరతాబాద్, సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం, నల్లగుట్ట, కవాడిగూడ, సెయిలింగ్ క్లబ్, కర్బాలా తదితర ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తామని వివరించారు.