
- హెచ్ఎండీఏకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు
- ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం 435 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయం
- హెచ్ఎండీఏ, రక్షణ శాఖల మధ్య కుదిరిన ఎంవోయూ
- ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డెయిరీఫామ్ వరకు 5.3 కి.మీ. కారిడార్
- ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకూ 18.14 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్
- పనులకు త్వరలో ముహూర్తం నిర్ణయించనున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ప్రాజెక్టు కోసం భూములను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా గత మార్చి నెలలో రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల బదలాయింపుపై చర్చల తర్వాత 65.038 ఎకరాలు (2,64,583.47 చ. మీ.) రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. దీనికి రిటర్న్‌గా ప్రభుత్వం 435 ఎకరాలు(17,60,384.10 చ. మీ.) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ భూ బదలాయింపులకు సంబంధించి శనివారం రక్షణ శాఖకు చెందిన తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా కమాండెంట్ హెడ్ఆఫీసులో ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్, రక్షణ శాఖ తరఫున హెడ్‌క్వార్టర్స్ తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా, బ్రిగేడియర్ ఎస్.రాజీవ్, స్టేషన్ కమాండర్ మధ్య సికింద్రబాద్ ప్రాంతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి అవసరమైన ఏ–1 రక్షణ భూముల బదిలీ కోసం సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బ్రిగేడియర్ కె.సోమశంకర్, ఎస్ఎం(రిటైర్డ్), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా ఇతర సైనిక అధికారులు హాజరయ్యారు. రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణానికి 2024, మార్చి1న పర్మిషన్ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే 44 కింద ప్యార డైజ్ జంక్షన్ నుంచి బోయిన్ పల్లి డైరీఫామ్ రోడ్ వరకు(5.320 కి.మీ.) అలాగే స్టేట్‌హైవే 1 కింద ప్యారడైజ్ నుంచి శామీర్ పేట్ వరకు(18.14 కి.మీ.) చేపట్టే ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రారంభమయినట్టేనని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు స్వరూపం ఇలా..
రాజీవ్ రహదారిలో జింఖానా మైదానం నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్స్టేషన్, తూంకుంట, శామీర్‌పేట మీదుగా ఓఆర్ఆర్ వరకూ ఒక ఎలివేటెడ్కారిడార్ నిర్మించనున్నారు. అలాగే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్రోడ్ వరకు మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్కారిడార్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మధ్యలో అంటే ఎయిర్‌పోర్ట్‌కు ఆనుకుని 0.600 కి.మీ. అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. మొత్తం రూ.3,812 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో భాగంగా ప్రైవేట్ ఆస్తులు కూడా ఈ రెండు చోట్ల సేకరించనున్నారు. సేకరించాల్సిన ప్రైవేట్ ఆస్తుల మార్కింగ్ ఇప్పటికే పూర్తిచేశారు. వారికి నోటీసులు కూడా జారీ చేశారు. వారికి పరిహారం ఇచ్చిన తర్వాత భూసేకరణ చేయనున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్రోడ్ వరకూ 5.320 కి.మీ. మేరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.1580 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 65 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ప్యారడైజ్ జంక్షన్ నుంచి హకీంపేట మీదుగా శామీర్‌పేట ఓఆర్ఆర్ను కలిపే ఎలివేటెడ్కారిడార్ను రూ.2,232 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 300 ప్రైవేట్నిర్మాణాలను కూల్చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే డబుల్‌డెక్కర్ కారిడార్‌కోసం 200 పైగా నిర్మాణాలను గుర్తించారు. భూసేకరణకు లైన్ క్లియర్ కావడంతో త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి అధికారులు ముహూర్తం నిర్ణయించనున్నట్టు తెలిపారు.